తెలంగాణలో నీళ్లకన్నా బార్‌లే ఎక్కువ: లక్ష్మణ్‌

18 Aug, 2019 19:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురి పాలవుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ కె.లక్ష్మణ్ టీఆర్‌ఎస్‌ పార్టీపై మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని  గుర్తుచేశారు. ‘తెలంగాణ సమస్యలను పరిష్కరించలేని నువ్వు రాయలసీమను రతనాలసీమగా మారుస్తాననడం విడ్డూరంగా ఉంద’ని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. బార్లు తెరిచి, బీర్లు  తాగండి తన్నుకు చావండన్న ధోరణిలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెల్లో నీళ్లు దొరకడం లేదు కానీ పల్లెల్లో బీర్లు దొరుకుతున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కేసీఆర్ మాత్రం ట్రెజరీలో డబ్బులను దాస్తున్నారని ఆరోపించారు. 

ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్ను సరిగ్గా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శించారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణ నెంబర్‌వన్‌ అని కేసీఆర్ ను ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులమవుతామా అని అన్నారు. అమిత్ షాని అభినవ సర్దార్ పటేల్‌గా అభివర్ణిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందరం కలిసికట్టుగా తెలంగాణను కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.  టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ, కాంగ్రెస్ తల్లీ కోడుకుల పార్టీ  అని ఇరు పార్టీలను లక్ష్మణ్  తూర్పారబట్టారు.

మరిన్ని వార్తలు