‘టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ అంటే భయం’

2 Sep, 2017 20:03 IST|Sakshi

పరకాల : తెలంగాణ ఉద్యమంలో ఆత్మ గౌరవ పోరాటం అన్న కేసీఆర్ ఇప్పుడు విమోచన దినాన్ని మరవడం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పరకాల అమరధామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విమోచన పోరాటాన్ని కనీసం పాఠ్యాంశాల్లో చేర్చక పోవడం దారుణమని, ఉద్యమ సమయంలో సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ..ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినాన్ని ఎందుకు జరపటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన మజ్లిస్ మెప్పు కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్‌ తాకట్టు పెడుతున్నారని, ప్రజలు ముఖ్యమా..లేక మజ్లీసా తేల్చుకోవాలని హెచ్చరించారు.  మెజారిటీ ఉన్న టీఆర్‌ఎస్‌ మజ్లిస్ కు భయపడటం సిగ్గు చేటన్నారు.

‘అధికారికంగా సెప్టెంబర్ 17 జరపక పోతే... తెరాస ఓటమి పరకాల నుంచే ప్రారంభమవుతుంది. 2019 లో బీజేపీ అధికారం లోకి వస్తుంది, అప్పుడు మేమే హామీ నెరవేరుస్తాం’’ అని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 న జాతీయ పతాకం ఎగురవేయటం సీఎం నైతిక బాధ్యతని గుర్తుచేశారు. చరిత్రను ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టకూడదని, పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతారని విమర్శించారు.

మరిన్ని వార్తలు