కాంగ్రెస్‌ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం : మురళీధర్‌ రావు

26 Feb, 2017 19:11 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం : మురళీధర్‌ రావు

కరీంనగర్ : దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. కరీంనగర్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే ఏడాది నుంచి క్యాష్ లెస్ ద్వారానే పార్టీ విరాళాలు సేకరిస్తామన్నారు.

రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కాంట్రాక్టు, కమీషన్ల ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ సర్కార్‌ అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మ్యూజియం మోడల్ వలే సిద్దిపేటలో మాత్రమే కడితే సరిపోతుందా అని నిలదీశారు.

కేంద్ర నిధులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా నిధులు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు ఖర్చుచేయడం లేదని చాలెంజ్ చేసి చెబుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ అందుకే పోరాటం చేయడం లేదని ఆయన చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రధానపార్టీగా బీజేపీ అవతరించబోతోందని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతమున్న అధికార, ప్రతిపక్ష నేతలు జైలుకెళ్లేవారేనని మురళీధర్‌రావు అన్నారు.

మరిన్ని వార్తలు