మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

26 Apr, 2019 03:06 IST|Sakshi

బీజేపీ డిమాండ్‌

గవర్నర్‌కు వినతిపత్రం అందించిన పార్టీ ప్రతినిధులు 

ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల తప్పిదాల విషయంలో విద్యార్థుల కుటుంబాల పక్షాన పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలను అవహేళన చేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఈ అక్రమాల వ్యవహారంలో ముఖ్య మంత్రి ఎందుకు మంత్రిపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించింది. ఇంటర్‌ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకునేలా స్పందించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఇంటర్‌ స్థాయి పరీక్షల నిర్వహణ అనుభవం లేని గ్లోబరీనాకు ఎందుకు అప్పగించారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

ఫలితాల్లో తప్పిదాల వల్ల లక్షల మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని, 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేవరకు బీజేపీ పోరాటం ఆపదని తేల్చి చెప్పారు. ఇకపై విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇంత గొడవ నడుస్తున్నా వారం వరకు సీఎం కేసీఆర్‌ స్పందించకపోవటం విడ్డూరమని, కనీసం ఇప్పటికైనా స్పందించినందుకు సంతోషమన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేసేవరకు ఉద్యమం సాగుతుందని చెప్పారు. బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ను తప్పించాలని డిమాండ్‌ చేశారు. తమ విన్నపాన్ని గవర్నర్‌ తీవ్రంగానే పరిగణించారన్నారు. 

పిల్లలూ ధైర్యంగా ఉండండి: దత్తాత్రేయ
తమ విన్నపానికి గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, వారు ధైర్యంగా ఉండాలని సూచించారు. వెంటనే ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల మనోవేదనకు రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం కలచివేస్తోందన్నారు. ముఖ్యమంత్రి పాలన ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆమె ఎద్దేవా చేశారు. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న సీఎంకు ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, రామచంద్రరావు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు.   

మరిన్ని వార్తలు