కమలంలో ముసలం

11 Nov, 2018 07:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక భారతీయ జనతా పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఏళ్లగా పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఎన్నికల సమయంలో మొండిచెయ్యి చూపుతున్నారనే అపవాదును పార్టీ పెద్దలు మూట గట్టుకుంటున్నారు. నిర్మల్‌లో ఇటీవల పార్టీలో చేరిన స్వర్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మల్లికార్జున్‌రెడ్డికి మొండిచెయ్యి చూపారు. దీంతో మల్లికార్జున్‌రెడ్డి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
 

ఆసిఫాబాద్‌లో జెడ్పీటీసీ రామ్‌నాయక్‌ టికెట్టు తనకే అనే ధీమాతో ఉన్న సమయంలో కొత్తగా పార్టీలో చేరిన ఆత్మారాం నాయక్‌కు సీటిచ్చింది అధిష్టానం. ఇక్కడ అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. బోథ్‌లో కూడా ఇదే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలోని 10 సీట్లలో ఇప్పటికే ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించగా, సగం స్థానాల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. మిగిలిన మంచిర్యాల, చెన్నూరు సీట్లకు అభ్యర్థులను ఆదివారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. తుది జాబితాను 12వ తేదీ తరువాత ఢిల్లీ నుంచి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ రెండు సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో జరుగుతున్న కసరత్తులో కూడా పార్టీని నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలను కమలం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లా అధ్యక్షుని సీటుకు ఎసరు..
మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి పార్టీనే అంటిపెట్టుకొని కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల ప్రకటనకు కొద్దిరోజుల ముందు నుంచి మంచిర్యాల సీటు విషయంలో మల్లారెడ్డికి వ్యతిరేక సంకేతాలు అందాయి. మంచిర్యాలకు చెందిన ఎన్నారై ఎరవెల్లి రఘునాథ్‌ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. రాజకీయంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన రఘునాథ్‌కు పార్టీ జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలున్నాయి. మంచిర్యాలకు చెందిన సీనియర్‌ నాయకుడొకరు ఆయనకు పూర్తి సహకారం ఇస్తున్నారు. కరీంనగర్‌లో అమిత్‌షా పర్యటన తరువాత టికెట్టు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెలరోజుల నుంచి పట్టణంలో పార్టీ యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ, ప్రచారం సాగిస్తున్నారు.

ఈ పరిణామాలు పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డికి రుచించడం లేదు. పార్టీ రాష్ట్ర నేతలకు స్థానిక పరిస్థితులను వివరించి, తనకే టికెట్టు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో మంచిర్యాల పేరును ప్రకటించలేదు. ఇదే సమయంలో దూకుడు పెంచిన రఘునాథ్‌ శుక్రవారం మంచిర్యాల పట్టణానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును ఆహ్వానించి, విద్యావంతులతో ఇష్టాగోష్టి కార్యక్రమం ఏర్పాటు చేయించారు. ఈ పరిణామాలతో అవాక్కయిన మల్లారెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లి తన ప్రయత్నాల్లో మునిగారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్టు ఎలా ఇస్తారని ఆయన హైదరాబాద్‌ పెద్దలను ప్రశిస్తున్నప్పటికీ, సరైన సమాధానం లేదని తెలిసింది. మరోవైపు రెండురోజుల్లో ప్రకటించే తుది జాబితాలో తన అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని రఘునాథ్‌ ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పడం గమనార్హం.

చెన్నూరులో ఇద్దరి మధ్యే పోటీ..
చెన్నూరు సీటు విషయంలో కూడా సందిగ్ధత తొలగలేదు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాంవేణుతో పాటు 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన అందుగుల శ్రీనివాస్‌ టికెట్టు కోసం పోటీ పడుతున్నారు. పార్టీ టికెట్టు హామీతోనే అందుగుల శ్రీనివాస్‌ బీజేపీలో చేరినా, 2014 ఎన్నికల్లో అవకాశం రాలేదు. ఈసారి వస్తుందని ఆశించిన ఆయనకు రాంవేణు నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా తనకే అవకాశం వస్తుందని రాంవేణు ధీమాతో ఉన్నారు. పార్టీ జిల్లా కమిటీ అందుగుల శ్రీనివాస్‌ పేరును ప్రతిపాదించినప్పటికీ, జిల్లా అధ్యక్షుడే టికెట్టు కోసం చమటోడుస్తున్న తరుణంలో చెన్నూరు సీటు గురించి అడిగేవారు లేరు. ఆదివారం నాటి సమావేశంలో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు