పాతబస్తీనా.. మినీ పాకిస్తానా?

26 Nov, 2014 00:19 IST|Sakshi
పాతబస్తీనా.. మినీ పాకిస్తానా?

బీజేపీ సభ్యుడు రాజాసింగ్ వ్యాఖ్యలతో శాసనసభలో దుమారం
 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని పాతబస్తీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం శాసనసభలో తీవ్ర దుమారం లేపాయి. జీరో అవర్‌లో ఆయన ఉగ్రవాద కార్యకలాపాల అంశాన్ని లేవనెత్తారు. పాతబస్తీ మినీ పాకిస్తాన్‌లా మారుతోందని ఈ సందర్భంగా అన్నారు.  ‘‘సాయిబాబా దేవాల యం, గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉగ్రవాద చర్యలతో సంబంధమున్నవారు పాతబస్తీలో పట్టుబడుతున్నారు. ఇటీవల వేరే ప్రాంతంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనకు సంబంధిం చిన నిందితుడు కూడా పాత నగరంలోనే పట్టుబడ్డాడు. అతను ఉంటున్న ఇంటికింది భాగంలో ఓ లోకల్ పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. పాతబస్తీ క్రమంగా మినీ పాకిస్తా న్‌లా మారుతోంది’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తొలుత మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్, మజ్లిస్ సభ్యులు సభ ముందువైపు దూసుకొచ్చి అభ్యంతరం తెలిపారు.

ఈ తరుణంలో రాజాసింగ్ మైక్‌ను స్పీకర్ కట్ చేసినప్పటికీ ఆయన గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో సభ గందరగోళంగా మారింది. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకుని రాజాసింగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ‘సభ్యుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది పద్ధతి కాదు. ఇది అసెంబ్లీ అన్న విషయం మరిచిపోవద్దు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొల గించాలి’ అని డిమాండ్ చేశారు. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినా సభ అదుపులోకి రాకపోవడంతో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు