రూ.7 వేల కోట్లిచ్చాం.. ఏంచేశారు?    

11 Jul, 2020 08:27 IST|Sakshi

కరోనా కట్టడిలో కేంద్రాన్ని నిందించడం సరికాదు

వైరస్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వమే విఫలమైంది..

ఎంపీ సోయం బాపురావు

కైలాస్‌నగర్‌(ఆదిలాబాద్‌): కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మంది కరోనా బారినపడి బాధపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని తన ప్రాణాలు బాగుంటే చాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని, సరైన వైద్యం అందక ప్రతీరోజు కరోనా మరణాలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేంద్రం నుంచి నయాపైసా రాలేదని రాష్ట్ర మంత్రులు విమర్శిస్తూ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ కార్మికులు, నిరుద్యోగులను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ కింద రూ.90 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. అందులోంచి తెలంగాణకు రూ.7,650 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చూస్తోందని దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బంది పడకుండా జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బులు వేశామని..ఉచితంగా వంటగ్యాస్‌ ఇచ్చామని, నిరుద్యోగులకు, చిరువ్యాపారులకు స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కలిపిస్తూ.. పంట బీమా కోసం రూ.64 కోట్లు కేటాయించామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించేందుకు 14 ప్రభుత్వ ల్యాబ్‌లు, 21 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. అంతే కాకుండా 42 లక్షలు పీపీఈ కిట్లు, 6.49లక్షల మాస్కులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. ఇంత చేసినా కేంద్రం నుంచి ఏమి రాలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతోనే ఆస్పత్రి పూర్తి కాలేదు..
ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ విమర్శించారు. జిల్లా ప్రజలకు కరోనా సమయంలో ఇది ఎంతో ఉపయోగపడేదన్నారు. రెండేళ్ల క్రితం పూర్తి కావాల్సిన ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. కరోనా కట్టడికి నిధులు కేటాయించకుండా మూఢనమ్మకాలకు పోయి సచివాలయాన్ని కూలగొట్టి దానికి రూ.600 కోట్లు కేటాయించారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, పార్లమెంటు కన్వీనర్‌ వకుళాభరణం ఆదినాథ్, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, నాయకులు జోగు రవి, లోక ప్రవీణ్‌రెడ్డి, లాలామున్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు