నేడు, రేపు బీజేపీ పరామర్శ పర్యటనలు 

7 May, 2019 03:01 IST|Sakshi

ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలకు భరోసా 

కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు, సీబీఐ విచారణ కోరుతాం 

డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న 26 మంది విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఆ కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపి, ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చేలా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఈ నెల 7, 8 తేదీల్లో పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు బృందాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోని ఆయా కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఫిర్యాదు చేస్తామని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతామని చెప్పారు. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇందుకోసం ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. అక్కడ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి విజ్ఞాపనపత్రం అందజేస్తామన్నారు.

ఈ నెల 11, 12 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక్కరోజు నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులతో 15, 16 తేదీల్లో అన్ని జిల్లాకేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ప్రభుత్వం ‘పుండు మీద కారం చల్లినట్లు’గా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా బీజేపీ పోరాటం చేస్తే నిర్భందాలు, నీరుగార్చే కుట్రలు చేశారని ఆరోపించారు. బోర్డు తప్పిదాలపై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కనీసం స్పందించకపోగా, విపక్షాలపై బురద జల్లుతున్నారన్నారు. అర్హత లేనివారితో బోర్డు జవాబు పత్రాలు దిద్దించిందని ఆరోపించారు. ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి అశోక్‌ తప్పిదాల వల్లే ఇంత గందరగోళం జరిగితే, ఆయనతోనే సమాధానం చెప్పించడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. 

అభివృద్ధిని అడ్డుకోవడం తగదు 
అంబర్‌పేటలో దర్గా ఉందనే సాకుతో ప్రజోపయోగ పనులను అడ్డుకోవడం తగదని లక్ష్మణ్‌ అన్నారు. మూడురోజులు మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్కడ ప్రార్థనలు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అక్కడికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మాత్రం అరెస్టు చేశారన్నారు. 

పాత జిల్లాలవారీగా పరామర్శించే బృందాలు ఇవే..
హైదరాబాద్, రంగారెడ్డి: లక్ష్మణ్‌ నేతృత్వంలో డీకే అరుణ, ప్రేమేందర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, వై.గీత, ఎస్‌.కుమార్, వేముల అశోక్‌ 
మెదక్, నిజామాబాద్‌: మురళీధర్‌రావు నేతృత్వంలో ఎ.పి.జితేందర్‌రెడ్డి, ఆనందభాస్కర్, ఎం.ధర్మారావు, యెండల లక్ష్మినారాయణ, మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి 
నల్లగొండ, వరంగల్‌: బండారు దత్తాత్రేయ నేతృత్వంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, చింతా సాంబమూర్తి, ఎస్‌.మల్లారెడ్డి, కె.శ్రీధర్‌రెడ్డి, భరత్‌గౌడ్‌ 
మహబూబ్‌నగర్, కరీంనగర్‌: కిషన్‌రెడ్డి నేతృత్వంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, విజయరామారావు, రామకృష్ణారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పాపారావు, ఆకుల విజయ.

ఇంటర్‌ వివాదం నుంచి దృష్టి మళ్లించే కుట్ర: లక్ష్మణ్‌
డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న లక్ష్మణ్‌. చిత్రంలో బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి. చింతల తదితరులు 

రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఫలితాల్లో జరిగిన అవక తవకలపై ప్రజల దృష్టికి మళ్లించేందుకు ఎంఐఎం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డిలతో డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. అంబర్‌పేటలో జరిగిన వివాదంపై లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం లక్ష్మణ్, దత్తాత్రేయ మాట్లాడుతూ అంబర్‌పేటలో ఫ్లైఓవర్‌ ఘటనలో పరిహారం చెల్లించే విషయంలో చెలరేగిన వివాదాన్ని పథకం ప్రకారం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంటర్‌ బోర్డులో అవకతవకలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎంఐఎం ఈ వివాదానికి ఆజ్యం పోసిందని విమర్శించారు. సోమవారం జరిగిన వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను, ఇతర నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిం చారు. పోలీసుల ఏకపక్ష తీరును డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.  కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయకుండా సీఎం కేసీఆర్‌ కేరళ వెళ్లడాన్ని లక్ష్మణ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు