ఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధం: లక్ష్మణ్‌

14 Feb, 2019 02:11 IST|Sakshi

ఫిబ్రవరిలో అమిత్‌ షా, మార్చిలో మోదీ పర్యటనలు

‘దేశం కోసం మోదీ– మోదీ కోసం దేశం’ అనే నినాదంతో ముందుకు...

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలలోనే అన్ని రాష్ట్రాల్లో అమిత్‌ షా పర్యటనలుంటా యని, మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తారని తెలిపారు. ‘దేశం కోసం మోదీ– మోదీ కోసం దేశం’ అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, మోదీ పాలన, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు.

‘భారత్‌ కి మన్‌ కీ బాత్‌– మోదీ కే సాత్‌’ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజల సలహాలు తీసుకుంటున్నామన్నారు. ‘కమల్‌ జ్యోతి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ని బీజేపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో దీపాలను వెలిగిస్తామన్నారు. కేబినెట్‌ లేకపోవడంతో రాష్టంలో పాలన స్తంభించిపోయిందని, వందల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతున్నాయన్నారు. అనంతరం ‘రైతుబంధువు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదించండి’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి, బి.జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మార్చి 2న బీజేపీ బైక్‌ ర్యాలీలు
మార్చి 2న ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిం ది. మండల కేంద్రాలను కలుపుతూ 50 నుంచి 60 కి.మీ.లు పర్యటించాలంది. ఈ కార్యక్రమాన్ని యువమోర్చా సభ్యులతో నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 28న ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో యువజన సమ్మేళనాలు నిర్వహించాలని పేర్కొంది. 

విపక్షాల ఆరోపణలు అర్థరహితం 
కాగ్‌ నివేదికతో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో విపక్షాల ఆరోపణలు అర్థరహితమని తేలిపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టిన దళారీ వ్యవస్థను మోదీ అడ్డుకున్నారన్నారు. 

కాంగ్రెస్‌ అబద్ధాలకోరు అని తేలింది
రఫేల్‌ యుద్ధ విమానాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇన్ని రోజులుగా చేసిన విమర్శలు అబద్ధాలని ‘కాగ్‌’ రిపోర్ట్‌ ద్వారా తేలిపోయిందని లక్ష్మణ్‌ అన్నారు. సుప్రీంకోర్టు, ’కాగ్‌ నివేదిక’ బీజేపీ వాదనను, మోదీ నిజాయితీని తేటతెల్లం చేశాయన్నారు. ఇది రాహుల్, కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదన్నారు.  

>
మరిన్ని వార్తలు