రెండు రాష్ట్రాల సీఎంల నిర్ణయం భేష్‌ 

30 Jun, 2019 03:13 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆలస్యమైనా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలనుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ స్వాగతించారు. అయితే, ఈ ఆలోచన గతంలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్ర పచ్చగా ఉండాలంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆ ధ్యాస అప్పుడెందుకు లేకపోయిందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నగరంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్న కేంద్రం సూచనను సీఎం కేసీఆర్‌ పెడచెవిన పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

రెండు రాష్ట్రాలకు సమృద్ధిగా తాగునీరు, సాగునీరు, పారి శ్రామిక అవసరాలకు నీటి సదుపాయం ఉండాలన్నదే బీజేపీ అభిమతమని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుతో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం భద్రమేనా అని కె.లక్ష్మణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 34 లక్షల క్యూసె క్కుల వరదతోనే భద్రాచలంలో 43 అడుగుల వరకు నీరు చేరుకొని రాములవారి పాదాల వరకు నీరు వస్తుందని హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు 50 లక్షల క్యూసెక్కులతో వరద వస్తే భద్రాచలం పరిస్థితేంటని నిలదీశారు.

ఆ పిటిషన్‌ ఉట్టిదేనా... 
‘పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయమంటూ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్‌ కూతురు కవిత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ ఉట్టిదేనా, ఇప్పుడు ఆ ప్రాజెక్టుతో ప్రజలకెలా న్యాయం జరుగుతుంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేందుకే పిటిషన్లు వేశారా’అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఇద్దరు సీఎంల సమావేశంలో పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరికిందా.. తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్, నల్లగొండ జిల్లాలకు న్యాయం జరిగేలా ఒప్పందాలు కుదిరాయా.. అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి, గోషామహల్‌కు చెందిన ఇతర పార్టీల నాయకులు కె.రాజేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్వీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిరాంగౌడ్, సామాజిక కార్యకర్త భండారి, సుదేష్ణిదేవి, టీఆర్‌ఎస్‌ యూత్‌ వింగ్‌ లీడర్‌ కమలాకర్‌రెడ్డి, సాయిరాం గౌడ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పృథ్వీరాజ్‌తోపాటు శేరిలింగంపల్లి, గోషామహల్‌ నుంచి 100 మందికిపైగా నాయకులు, ప్రముఖులు, ఇతర పార్టీ కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  

మరిన్ని వార్తలు