‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది’

21 Aug, 2019 13:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్‌​ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి నివేదిక కోరినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇంటర్‌ బోర్డు తప్పిదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న అనామిక సోదరి ఉదయశ్రీ చదువుతున్న ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాలకు కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజసింగ్ వెళ్లారు. ఈ క్రమంలో ఉదయశ్రీ కళాశాల ఫీజును మాఫీ చేయాలని యాజమాన్యాన్ని లక్ష్మణ్ కోరారు. దీనికి కళాశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. 

ఉదయశ్రీ పుస్తకాల ఖర్చులు బీజేపీ తరపున అందిస్తామని లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు. అనంతరం కళాశాలలోనే 15వేల చెక్కును ఉదయశ్రీకి అందించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్రిస్తుందని, దీనికితోడు ఇతర పార్టీలపై ఎదురుదాడికి దిగుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని, వెంటనే రాష్ట్రపతికి నివేదిక పంపించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు