ఆర్టీసీ సమ్మె: ప్రత్యక్ష కార్యాచరణకు బీజేపీ నిర్ణయం

11 Oct, 2019 17:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు పార్టీ తరపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ శుక్రవారం వెల్లడించారు. అందులో భాగంగా శనివారం రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో, బస్‌ భవన్‌ ఎదుట, ఆర్టీసీ జేఏసీ ధర్నాలలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పండుగ పూట జీతాలు కూడా ఇవ్వకుండా కార్మికుల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర చేస్తున్నారనీ, ఇప్పటికే వరంగల్‌లో మూడెకరాలను అనుచరులకు ఇచ్చేశారని మండిపడ్డారు.

గత ఆరు సంవత్సరాల్లో ఆరు సార్లు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి‌, కష్టపడి పనిచేస్తోన్న కార్మికులను డిస్మిస్‌ చేయడమేంటని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ కార్మికశాఖా మంత్రిగా పనిచేసినా చట్టాలపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. పాలకులు నియంతలుగా మారి ప్రశ్నించే వాళ్ల గొంతును నొక్కేస్తున్నారని, అమరుల త్యాగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సమ్మె కేవలం 50 వేల మంది కార్మికుల సమస్య కాదని యావత్‌ తెలంగాణ ప్రజల సమస్యని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మెడలు వంచే సత్తా కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. మలిదశ ఉద్యమం లాగా తుదిదశ ఉద్యమం​ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలకు బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు