వారసత్వ రాజకీయం మనకొద్దు 

25 Mar, 2019 02:54 IST|Sakshi

ఆ తరహా రాజకీయాలతో ప్రజాస్వామ్యానికే విఘాతం

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌

హైదరాబాద్‌ : వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతమని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కుటుంబ పాలన చేసేవారు ఢిల్లీలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా వారివల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదన్నారు. బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా నిర్మలా సీతారామన్‌ పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలం క్రమంగా పెరుగుతోందని, నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆమె అన్నారు.

దేశ భద్రత విషయంలో తాము రాజీపడేది లేదని, భారతదేశంలోకి ముష్కరుల చొరబాట్లు, తీవ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, శత్రువులకు దీటుగా బదులిచ్చామని వెల్లడించారు. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా చక్కబడుతోందని, అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని, అందుకు తగిన చర్యలు ప్రారంభించామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులు డాక్టర్‌ భగవంతరావు, కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు