లీడర్‌ లోటు

22 Apr, 2018 09:30 IST|Sakshi

బీజేపీకి నాయకత్వ సమస్య

ఎన్నికలు దగ్గరపడుతున్నా.. బలోపేతం దిశగా పడని అడుగులు..

కార్యకర్తల్లో ఉత్సాహం నింపేవారేరీ..

ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో దుస్థితి

భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్య కొనసాగుతోంది. ఎన్నికలకు ఏడాదే గడువున్న తరుణంలో పార్టీకి బలమైన నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీ బలోపేతానికి ప్రతిబందకంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పార్టీకి పలువురు సీనియర్‌ నేతలు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వలేకపోయారు. నిజామాబాద్‌ అర్బన్, రూరల్‌ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ టిక్కెట్టుకు పోటీదారులు, పార్టీ కార్యక్రమాలు కాస్త చురుకుగా సాగుతున్నాయి.

సాక్షి, నిజామాబాద్‌: భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్య కొ నసాగుతోంది. ఆయా చోట్ల అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాం గ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఢీకొనే సామ ర్థ్యం కలిగిన నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పార్టీకి పలువురు సీనియర్‌ నేతలు ఉన్నప్పటికీ.. వారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో ఒకటీ రెండు నియోజకవర్గల్లో మినహా అన్ని చోట్ల ఈ పరిస్థితే నెలకొంది. ఎన్నికలకు ఏడాదే గడువున్న ఈ తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీ బలోపేతా.నికి ప్రధాన ప్రతిబందకంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీ కార్యక్రమాలను మీదేసుకుని చేసే నాయకులు కూడా కరువయ్యారు. ఒకవైపు అన్ని పార్టీలతో సహా బీజేపీ కూడా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ అంశం తెరపైకి వస్తోంది.

బాల్కొండ నియోజకవర్గంలో పెద్దొల్ల గంగారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్‌ వంటి నాయకులు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆర్మూర్‌లో పల్లెగంగారెడ్డి, అల్జాపూర్‌ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి వంటి పార్టీ సీనియర్‌ నేతలతో పాటు,  డాక్టర్‌ మధుశేఖర్‌ ఏడాది క్రితం పార్టీలో చేరారు. ఈ రెండు చోట్ల పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను మమ అనిపించడం మినహా, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు పడలేదు. ఈ రెండు చోట్ల అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొనే స్థాయిలో పార్టీ కార్యకలాపాలేవీ జరగలేదు. 2014 ఎన్నికలో పొత్తులో భాగంగా ఈరెండు స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోవడం కూడా నాయకత్వ లేమికి ఓ కారణమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. బోధన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నర్సింహరెడ్డి కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీకి దీటుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన దాఖలాలేవీ ఇటీవల కనిపించడం లేదు.

బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైడిమల్‌ లక్ష్మినారాయణ, అర్సపల్లి సాయిరెడ్డి వంటి నాయకులున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఢీకొనే పరిస్థితుల్లో ఈ నేతలు లేరు. జుక్కల్‌ నియోజకవర్గంలోనూ ఇదే సమస్య. పార్టీ ఇన్‌చార్జిగా రేవణ్‌ కొనసాగుతున్నారు. అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అభ్యర్థులకు గట్టి పోటీని ఇచ్చే నాయకులు బీజేపీకి లేరనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు కొంత పోటీని ఇవ్వగలిగారు. ప్రారంభంలో పలు మండలాల్లో బీజేపీ బలోపేతానికి కొంత కసరత్తు చేసినప్పటికీ., ఇటీవల ఆయన పార్టీ కార్యక్రమాలను తగ్గించారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో కొన్ని మండలాలకు చెందిన బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కొంత మేరకు పట్టుంది. కానీ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇట్టెం సిద్దిరాములు ఇటీవల పార్టీని వీడారు. టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కమల దళంలో చేరారు.

అర్బన్, రూరల్‌లో కాస్త భిన్నం..
నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో ఇందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. మిగితా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య నెలకొనగా., అర్బన్‌లో మాత్రం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టికెట్టు ఆశిస్తున్న వారు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తతో పాటు, ఇటీవల పార్టీలో చేరిన బస్వ లక్ష్మినర్సయ్య కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. వీరిద్దరితో పాటు అవసరమైతే మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ కూడా టికెట్‌ రేసులో ఉంటారనే చర్చ కొనసాగుతోంది. ఈ ముగ్గురు నాయకులు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిజామాబాద్‌ రూరల్‌లో మాత్రం గడ్డం ఆనంద్‌రెడ్డి గత ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కేవలం పార్టీ ఆదేశించే కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.   

మరిన్ని వార్తలు