టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలి

23 Jun, 2019 11:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షపాత్రను పోషించేందుకు ముఖ్యమైన సమస్యలు, అంశాలపై వివిధరూపాల్లో ఆం దోళనలు, ఉద్యమాలకు సిద్ధం కావాలని సూచించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీ క్రమంగా బలహీనమవుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ పార్టీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేసింది. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే అసలైన ప్రత్యామ్నాయం అనే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి, కొత్త కేడర్‌ చేరికతోపాటు అన్నిస్థాయిల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల ని ఆదేశించింది. పార్టీ బలపడేందుకు ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రాజకీయంగా ఎదగడంతోపాటు ప్రజామద్దతును కూడగట్టేందుకు కృషిచేయాలని సూచించింది. శనివారం ఢిల్లీలో పార్టీ జాతీ య అధ్యక్షుడు అమిత్‌ షాతో రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ భేటీ అయిన సందర్భంగా ఆయా అం శాలు చర్చకు వచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం.  

కాంగ్రెస్, టీడీపీల స్థానం భర్తీ...
టీఆర్‌ఎస్‌ వ్యతిరేక రాజకీయశక్తిగా ఎదగడంలో భాగంగా ముందుగా ప్రధానప్రతిపక్షంగా కాంగ్రెస్‌స్థానాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన వ్యూహాలకు బీజేపీ మరింత పదును పెడుతోంది. రాష్ట్రంలో రాజకీయంగా కాంగ్రెస్, టీడీపీల స్థానాన్ని భర్తీ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలకు ఆ పార్టీ ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తోంది. ఏపీలో ఓటమిపాలయ్యాక అక్కడ రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిన టీడీపీని మరింత బలహీనపరిచేందుకు రంగాన్ని సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి నాయకులు, కార్యకర్తల బలమున్న నేపథ్యంలో ముందుగా వారందరినీ పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా టీడీపీ ముఖ్యనేతల బ్యాచ్‌ ఒకటి రాష్ట్ర బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ముందుగా రాష్ట్రంలో టీడీపీ అనేది లేకుండా చేసేందుకు అందులో ప్రభావం చూపే నాయకులందరినీ చేర్చుకోవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలను ప్రాధాన్యతాక్రమంలో, వివిధ జిల్లాల్లో పార్టీ అవసరం, ఆ నేతలు రావడం వల్ల పార్టీకి ఉపయోగం అని భావిస్తే చేర్చుకోవాలనే ఆలోచనతో ఉంది. కాంగ్రెస్‌పార్టీలో ప్రజామద్దతున్న వారితోపాటు ప్రజల్లో మంచి పలుకుబడి ఉండి, విశ్వసనీయత ఉన్న నాయకులను చేర్చుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.

ఉద్యమ కార్యాచరణపై..
వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపేలా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించాలని భావిస్తోంది. నిరుద్యోగ సమస్య, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీవైపు యువత మొగ్గుచూపుతున్నట్టు వెల్లడైన నేపథ్యంలో పెద్దఎత్తున యువతను పార్టీలో చేర్చుకొని వారి సమస్యలపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే పాఠశాలల సీజన్‌ మొదలైన నేపథ్యంలో తడిసి మోపెడైన చందంగా తయారైన స్కూలు ఫీజుల సమస్యపై ఉద్యమించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు