మోసాలను.. 'బ్లాక్' చేస్తుంది

5 Mar, 2018 01:50 IST|Sakshi

అందుబాటులోకి అత్యాధునిక బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ

ఒకే భూమిని చాలామందికి అమ్మేసే ఘనులు.. 

బ్యాంకుల్లో.. బంగారం అమ్మకాల్లో మోసాలు..  

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ 

ప్రభుత్వం నుంచి పేదలకు అందాల్సిన సబ్సిడీలు, రేషన్‌ సరుకుల్లోనూ కోతలు.. 

ఇలాంటి వాటిపై మన చేతుల్లో ఏముందని అనుకుంటున్నారా.. 

ఈ మోసాలకు కళ్లెం వేసేందుకు మన ముందుకొచ్చింది ‘బ్లాక్‌ చెయిన్‌’ మంత్రం!

సాక్షి, హైదరాబాద్‌: పారదర్శకతను ఈ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇంకోలా చెప్పాలంటే దొంగ చేతికి తాళమిస్తే చోరీలు జరగవన్నట్లు ఈ టెక్నాలజీలో సమాచారం అందరివద్దా ఉంటుంది. ఎవరు మోసం చేయాలన్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. అంటే కంపెనీ, బ్యాంకు లేదా ఏ సంస్థలోనైనా లావాదేవీల నమోదుకు ఉండే పుస్తకాలు (లెడ్జర్స్‌) ఉంటాయి. లెక్కలు రాసేందుకు జనరల్‌ లెడ్జర్, అమ్మకాల నమోదుకు సేల్స్‌ లెడ్జర్, కొనుగోళ్లకు సంబంధించి పర్చేసింగ్‌ లెడ్జర్‌ ఇలా ఉంటాయి. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో అన్ని లెడ్జర్లు అందరివద్దా అందుబాటులో ఉంటాయి. టెక్నికల్‌ భాషలో డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ అన్నట్లు. ఈ విభాగాల్లో దేనిలో ఏ చిన్న లావాదేవీ జరిగినా ఆ సమాచారం అందరికీ చేరుతుంది. అందరూ ఆమోదిస్తేనే ఆ లావాదేవీ ముందుకు సాగుతుంది. ఈ లావాదేవీల్లో సరుకులు అమ్మినవారితో పాటు కొనుగోలు చేసిన వారు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటారు. వారికి సంబంధించిన లావాదేవీలు ఎలా ముందుకెళ్తున్నాయో ఎప్పటికప్పుడు వీరికీ తెలుస్తుంటుంది. ఒకవేళ బ్యాంక్, కంపెనీ వాళ్లందరూ కుమ్మక్కై ఏదైనా ఫ్రాడ్‌ చేయాలనుకున్నా.. వీరికీ ఆ విషయం తెలిసిపోతుంది కాబట్టి చేయలేరన్నమాట! 

ఎవరి సృష్టి ఇది.. 
బిట్‌కాయిన్ల గురించి తెలుసు కదా..! వాటి కోసమే ఈ టెక్నాలజీ వచ్చింది. సటోషీ నకమోటో పేరుతో కొందరు అజ్ఞాత టెకీలు దీన్ని అభివృద్ధి చేశారు. అయితే అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ టెక్నాలజీని అన్ని రంగాల్లో ఉపయోగించొచ్చని నమ్మకం. నిపుణుల అంచనా ప్రకారం.. ఇది ఇంకోరకమైన ఇంటర్నెట్‌. సమాచారం కోసం సామాన్యుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడో.. అచ్చం అలాగే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ద్వారా అన్ని లావాదేవీలను సులువుగా ఎలాంటి మోసాలకు తావులేకుండా జరుపుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. 

ఒక్కో లావాదేవీ.. ఒక బ్లాక్‌! 
ఈ టెక్నాలజీ పేరు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ. బ్లాక్‌ అంటే ఒక భాగం. ప్రతి లావాదేవీ.. అందులో భాగమైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతాయి. ఒకవేళ ఈ బ్లాక్‌లో ఉన్నవారితో ఇంకో లావాదేవీ జరిగిందనుకోండి. అది మునుపటి బ్లాక్‌కు అనుబంధంగా ఇంకో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ వరుసగా ఒక చెయిన్‌ మాదిరిగా ఏర్పడతాయి. మొత్తం చెయిన్‌లో దేంట్లో మార్పులు జరిగినా అది ఆ లావాదేవీ నమోదైన బ్లాక్‌లో నమోదవుతుంది. పది నిమిషాలకు ఒకసారి బ్లాక్‌లలోని వివరాలు నెట్‌వర్క్‌లో ఉండే అందరి కంప్యూటర్లలోకి చేరి లావాదేవీలన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకుంటాయి. ఏదన్నా తేడా వస్తే.. ఆ విషయాన్ని నెట్‌వర్క్‌లో ఉన్న వారందరికీ తెలియజేస్తాయి. 

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తప్పులు, మోసాలకు అస్సలు ఆస్కారం ఉండదు. ప్రతిఒక్కరూ వందశాతం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కల్పిస్తుంది.  
– ఇయాన్‌ ఖాన్, టెక్నాలజీ ఫ్యూచరిస్ట్‌ 

ఆఫ్రికా, ఇండియా, తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాల్లో వ్యక్తులు కంపెనీలు, వ్యవస్థలను నమ్మడం మానేస్తున్నారు. అలాంటి చోట పరిస్థితులను పూర్తిగా మార్చేసే సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. 
– విటాలిక్‌ బుటెరిన్, ఎథీరియం సృష్టికర్త 

ఇవి రెండు రకాలు.. 
పబ్లిక్‌ బ్లాక్‌ చెయిన్‌ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలు, ప్రజలకు సంబంధించిన లావాదేవీలను నమోదు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకునేవి. రెండోది ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకునేవి. 

ఉపయోగాలు ఇవీ...
బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ అన్ని రంగాలకూ ఉపయోగకరమే. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నుంచి ప్రభుత్వాలను నిర్ణయించే ఓటింగ్‌ వరకూ అన్నింటిలోనూ దీన్ని ఉపయోగించొచ్చు. ఇది పారదర్శకత, నమ్మకాన్ని కలిగిస్తుంది. మోసాలకు తావుండదు. అందరి అంగీకారంతోనే ఏ వ్యవహారమైనా నడుస్తుంది. అధికారులు, లేదా రాజకీయ పార్టీల ఇష్టాఇష్టాలతో పని లేకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వాల నుంచి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీకి సంబంధించిన స్మార్ట్‌ కాంట్రాక్టును ఉపయోగించుకుని ఆస్తి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. సమాచార భద్రతకు ఢోకా ఉండదు. కొన్న వ్యక్తి ఎవరో.. అమ్మిన వారు ఎవరో కూడా తెలియదు. 

లావాదేవీలు జరిపేవారందరూ ఇక్కడ సమాన భాగస్వాములు. ఫలితంగా అధికారం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరూ దుర్వినియోగం చేసేందుకు వీలుండదు.  
    – బుక్కపట్నం మురళి 

ఈ టెక్నాలజీతో బ్యాంకులే ఉండవని అంటున్నారు కానీ అది అంత నిజం కాదు. ఎందుకంటే లావాదేవీలను ధ్రువీకరించేందుకు కొంతమంది అధికారుల అవసరముంటుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చేందుకు కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి.   
 – అఖిలేష్‌ టుటేజా, గ్లోబల్‌ సెక్యూరిటీ ప్రాక్టీస్‌ కో లీడర్, కేపీఎంజీ 

>
మరిన్ని వార్తలు