కాసులిస్తే..వేటుండదు!

28 Jun, 2014 03:10 IST|Sakshi
కాసులిస్తే..వేటుండదు!

సాక్షి, కరీంనగర్: తప్పు చేశారు.. అనుకోకుండా దొరికిపోయారు. ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకు నానాతిప్పలు పడుతున్నారు. సిబ్బం ది చేసిన తప్పిదాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ అధికారి.. వారిని వేటు పేరిట భయపెడుతున్నాడు. వేలాది రూపాయలు చెల్లించాలని, లేకుంటే శాఖాపరంగా శిక్ష తప్పదని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఏం చేయాలో తోచక కొందరు తమ ను మన్నించాలని సదరు అధికారిని వేడుకుంటుంటే.. ఇంకొందరు శాఖాపరమైన చర్యలకు జడిసి అడిగినంత ఇచ్చేస్తున్నారు.
 
 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న ఈ అవినీతి హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో 524 మంది రెగ్యులర్, 576 కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తాము పని చేసే కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో తిరిగి పారిశుధ్యం, ప్రజారోగ్యంపై రోగులు, గర్భిణులు, బాలింతలకు సల హాలు, సూచనలందిస్తారు. క్షేత్రస్థాయిలో తిరిగే సమస్య, జీతభత్యాలు తక్కువగా ఉండటంతో కాంట్రాక్టు పద్ధతి లో పనిచేసే పన్నెండుమంది ఏఎన్‌ఎంలు ఒకేచోట ఉండి పనిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పై చదువులు చదివి.. పీహెచ్‌సీ, ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్స్‌గా పర్మినెంట్ ఉద్యోగం సాధించాలనుకున్నారు. కరీంనగర్‌లో ఓ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. రోజు విడిచి రోజు విధులు ఎగ్గొట్టి కాలేజీకి రాకపోకలు సాగించారు. కొన్ని నెలలు వారి చదువు సాఫీగానే సాగింది. తర్వాత ఈ వ్యవహారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి దృష్టిలో పడింది. విధులకు బదులు కాలేజీలో శిక్షణకు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్న ఆ అధికారి ఏఎన్‌ఎంలు చేరిన కాలేజీ నుంచి నేరుగా వారి సర్టిఫికెట్లు.. హాజరుపట్టిక తెప్పించుకున్నారు. కాలేజీలో చదివేందుకు అనుమతి ఎవరిచ్చారని హెచ్చరించారు. కోర్సులో చేరిన తప్పునకు జరిమానాగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాలని ఏఎన్‌ఎంలతో చెప్పారు. దీంతో తమను మన్నించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏఎన్‌ఎంలు ఆ అధికారిని వేడుకున్నారు. అయినా తీరు మారని సదరు అధికారి డబ్బులివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 దీంతో చేసేదేమీ లేక కొందరు ఏఎన్‌ఎంలు డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై డీఎంహెచ్‌వో బాలు వివరణ ఇస్తూ.. జిల్లాలో చాలామంది కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్ కళాశాలల్లో చేరి, స్టాఫ్‌నర్సు శిక్షణ తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు