అంధత్వం అడ్డురాలేదు...

21 Feb, 2018 14:38 IST|Sakshi

ప్రభుత్వ కొలువు సాధించి..   

మహిళా లోకానికే ఆదర్శంగా నిలుస్తున్న మమత.. 

పుట్టుకతో అంధురాలైనప్పటికీ.. ఏనాడు ఆమె కుంగిపోలేదు.. చూపున్న వారితో పోటీపడి చదివింది.. ప్రభుత్వ కొలువు సాధించింది.. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యంతో తన కాళ్లపై తాను నిలబడింది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది.

దండేపల్లి(మంచిర్యాల) : దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన వొజ్జెల అంజయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు శ్రీనివాస్, కూతురు మమత. మమతకు పుట్టుకతోనే అంధత్వం ఉంది.  కూతురు అంధురాలని తల్లిదండ్రులు తరచూ బాధపడేవారు. ఒక్కగానొక్క కూతురు ఇలా అంధురాలిగా పుట్టడం తమ దురదృష్టం అని అందరితో చెప్పుకుంటుండేవారు. అలా కొన్ని రోజులు మమత దిగులు చెందింది. కానీ దిగులుపడితే చేసేదేం లేదని.. ఏదైనా సాధిస్తే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మమత సంకల్పించుకుంది.

బాధను దిగమింగుకుని కష్టపడి చదివా..
మమత తన అంధత్వంలో చిన్నప్పటినుంచి ఎదుర్కొన్న కష్టాలు ఆమె మాటల్లోనే.. నేను అంధురాలిని కావడంతో సమాజం మాత్రం నన్ను తోటి మనుషుల్లా కాకుండా హేళనగా చూసేవారు. ఈ విషయం నన్ను కొంత బాధకు గురి చేసింది. చిన్నతనంలో నాతోటి వారంతా ఆడుకుంటుంటే. నాకు కళ్లుంటే నేను కూడా ఆడుకునే దాన్ని అని మనసులో బాధపడేదాన్ని. దేవుడు నన్ను చిన్న చూపు చూశాడని అనుకుని బాధను దిగమింగుకున్నా. అయితే నాకు ఆరేడేళ్ల వయస్సులో మా తల్లిదండ్రులు నన్ను స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. రోజూ నన్ను బడిలో దింపి వచ్చేవారు. బడిలో నా తోటి విద్యార్థులు కూడా నన్ను హేళనగా చూసేవారు. వారలా చేయడంతో చదువుకుని ఉద్యోగం సాధించాలనే కసి నాలో పెరిగింది. ఉపాధ్యాయుడు చెబితే  నాతోటి విద్యార్థులు చదువుకునేది, రాసుకునేది. కానీ నేను చదవలేక, రాయలేక కేవలం విని అందరితో పాటు నేనూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదాన్ని. చదువులో నా ఆసక్తిని మా ఊరికి చెందిన శేఖర్‌సార్‌ గుర్తించాడు. ఇలాంటి వారికి కరీంగర్‌లో అం«ధుల పాఠశాల ఉంది. వీరికి ప్రత్యేక లిపి ఉంటుంది. అందులో చేర్పిస్తే బాగుంటుంది. అని మా తల్లిదండ్రులకు సూచించాడు.

తల్లిదండ్రుల్లో ధైర్యం నింపి..
అంధుల పాఠశాలలో నన్ను చేర్పించేందుకు మా అమ్మా, నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే చూపు లేక పోవడంతో ఇంటి వద్ద అయితేనే తాము చూసుకుంటామని, ఎక్కడో చదివిస్తే, ఎట్లా ఉంటావో బిడ్డా వద్దు ఇంటికాడనే ఉండాలని అన్నారు. అయినప్పటికీ అక్కడ చదవాలని నాలో కోరిక పెరిగింది. అమ్మానాన్నను ఒప్పించాను. వాళ్లు నన్ను కరీంనగర్‌ అంధుల పాఠశాలలో చేర్పించారు. 1నుంచి 10 వరకు కరీంనగర్‌లో చదువుకుని పాసయ్యాను. ఆతర్వాత హైదరాబాద్‌ అంధుల కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. ఏడాదిన్నర క్రితం వికలాంగుల కోటాలో మందమర్రి మున్సిపల్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాను. దీంతో నా జీవిత ఆశయం నెరవేర్చుకున్నా. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నా.

ప్రభుత్వం గుర్తించాలి..
ప్రభుత్వం పింఛన్‌ ఇచ్చి సరిపెట్ట్టకుండా ప్రత్యేకంగా దివ్యా ంగులను గుర్తిం చాలి. చదువు, ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ఎక్కువగా కల్పించి ప్రోత్సహించాలి. జిల్లాకో అంధుల పాఠశాల నెలకొల్పాలి. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులను నేను కోరేదేంటంటే. దివ్యాంగులు ఏం చదువుతారు లే అని ఇంటి వద్ద ఉంచుకోకూడదు. దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే చదువుతో పాటు అన్నింటా రాణిస్తారు. ఉద్యోగాలు కూడా సాధిస్తారు. తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించి దివ్యాంగులను చదివించాలి.

నాన్నే నాకు తోడుగా..
చదువంతా అంధుల పాఠశాల, కళాశాలలో పూర్తి కావడంతో ప్రస్తుతం ఉద్యోగంలో మాత్రం నాన్న అంజయ్య నాకు తోడుగా ఉంటున్నాడు. నేనిప్పుడు మందమర్రిలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు నాన్న తోడుగా ఉండి వంట చేసి పెడుతున్నాడు. రోజూ ఆఫీసుకు తీసుకెళ్లి తీసుకొస్తాడు. ఆఫీసులో కూడా నా తోటి ఉద్యోగులు నన్ను వారితో సమానంగా చూసుకుంటారు. నాకు ఇబ్బందితో కూడిన పనులు చెప్పరు. విధుల్లో నాకు అందరూ సహకరిస్తుంటారు. నేనీస్థాయిలో ఉండడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ రుణ పడి ఉంటాను.
 

మరిన్ని వార్తలు