కలతచెంది.. కాలినడకన బయలుదేరి..

6 May, 2020 10:42 IST|Sakshi
సోదరుడితో కలిసి నల్గొండకు నడుచుకుంటూ వెళ్తున్న అంధురాలు

నల్లగొండకు పయనమైన అంధురాలు

పోలీసుల చొరవతో వాహనం ఏర్పాటు

అబ్దుల్లాపూర్‌మెట్‌: అసలే అంధురాలు.. ఆపై ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు కలత చెంది నల్లగొండకు కాలినడకన పయనమైంది. మానసిక వికలాంగుడైన సోదరుడిని వెంటబెట్టుకుని రోడ్డుమార్గాన వెళుతుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు చూసి ఆరా తీశారు. వారికి భోజనం పెట్టి వాహనం సమకూర్చి నల్లగొండకు పంపించారు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వాటర్‌ వర్క్స్‌ ఈఈ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే బుచ్చమ్మ(అంధురాలు) ఉగాది పండుగ కోసం హయత్‌నగర్‌లో నివసించే తనభర్త, కుమారుడి దగ్గరికి మానసిక వికలాంగుడైన సోదరుడు పరమేష్‌తో కలిసి వచ్చింది.

ఈ క్రమంలో బుచ్చమ్మకు ఆమె భర్త ప్రేమానందంకు మధ్య గొడవ రావడంతో మంగళవారం తెల్లవారు జామున హయత్‌నగర్‌ నుంచి తన సోదరుడితో కలిసి నల్గొండకు కాలినడకన పయనమైంది. అంధురాలైన ఆమెకు మానసిక వికలాంగుడైన సోదరుడి చేతులు పట్టుకుని విజయవాడ జాతీయ రహధారిపై గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు చూసి ఆరా తీసి భోజం పెట్టారు. అనంతరం వాహనం సమకూర్చి నల్గొండకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే..  తన సోదరుడికి కూడా కళ్లు సరిగ్గా కనిపించవని బుచ్చమ్మ తెలిపింది. నల్లగొండకు వెళ్తున్నామని, హయత్‌నగర్‌లో తన భర్తతో పాటు ఇద్దరు కుమారులు, కోడలు ఉన్నారని, వారు తమ పట్ల కనికరం చూపకుండా గొడవపడ్డారని బుచ్చమ్మ వాపోయింది. 

మరిన్ని వార్తలు