లేనిరోగాన్ని అంటగట్టారు

5 Jun, 2015 04:35 IST|Sakshi
లేనిరోగాన్ని అంటగట్టారు

గాంధీ లేబొరేటరీ సిబ్బంది నిర్లక్ష్యం
గాంధీ ఆస్పత్రి(హైదరాబాద్): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ రోగికి లేని రోగాన్ని అంటగట్టారు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన భర్తతో కాపురం చేయలేనని, విడాకులు ఇవ్వాలంటూ అతని భార్య పట్టుబట్టింది. వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాలియాతండాకు చెందిన రవి (23) ఈనెల 1వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై గాంధీ ఆస్పత్రి అత్యసర విభాగంలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలు సేకరించిన సిబ్బంది ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి తరలించారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబొరేటరీ సిబ్బంది రవికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.

దీంతో రోగితోపాటు అతని బంధువులు నిర్ఘాంతపోయారు. అయితే, ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న రవితో కాపురం చేయలేనని, విడాకులు కావాలంటూ భార్య జ్యోతి పట్టుబట్టింది. అయితే, గాంధీ ఆస్పత్రి ల్యాబ్ రిపోర్టుపై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు రవికి నగరంలోని రెండు ప్రై వేటు ఆస్పత్రుల్లో వేర్వేరుగా రక్త పరీక్షలు చేయించారు. ఆ రిపోర్టుల్లో రవికి ఎలాంటి ప్రాణాంతక వ్యాధి లేదని స్పష్టమైంది. దీంతో ఆగ్రహంతో బంధువులు, కుటుంబసభ్యులు గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి అధికారులు స్పందించి ఆందోళనకారులను శాంతింపజేశారు. రవి రక్తాన్ని మరోమారు సేకరించి పరీక్షలు నిర్వహించగా హెచ్‌ఐవీ నెగిటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది.

>
మరిన్ని వార్తలు