గురుదేవుళ్ల నకి‘లీలలు’!

23 Jun, 2016 00:46 IST|Sakshi
గురుదేవుళ్ల నకి‘లీలలు’!

- రంగారెడ్డి జిల్లాలో బోగస్ టీచర్ల బాగోతం
- తప్పుడు ధ్రువీకరణతో కొలువులు దక్కించుకున్న వైనం
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైకల్యం లేదు కానీ వికలాంగుల కోటాలో కొందరికి ఉద్యోగాలు వచ్చాయి.. ఓపెన్ కేటగిరీకి చెందినప్పటికీ రిజర్వ్‌డ్ కోటాలో మరికొందరికి కొలువులు దక్కాయి.. స్థానికులు కానప్పటికీ లోకల్ కోటా నుంచి బడిపంతుళ్లుగా అవతరించారు. ఇలా 51 మంది  తప్పుడుమార్గంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వఉపాధ్యాయ కొలువులను దక్కించుకున్నారు.’ జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించడంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

 మూడు కేటగిరీల్లో విచారణ
 పలువురు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు సంపాదించారంటూ కలెక్టర్ రఘునందన్‌రావుకు గతేడాది మేలో కొందరు ఆధారాలతో సహా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వచ్చిన టీచర్లకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు సేకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వికలత్వ కేటగిరీలో 28 మంది, నకిలీ కులధ్రువీకరణ కేట గిరీలో 3, తప్పుడు బోనఫైడ్ల విభాగంలో 16 మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మూడు కేటగిరిలో విచారణ చేపట్టారు.

 విచారణ లోతుగా.. స్పష్టంగా..
 వికలత్వ విభాగంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న టీచర్లు నియామక సమయంలో సమర్పించిన మెడికల్ బోర్డుకు, ఈఎన్‌టీ ఆస్పత్రికి సర్టిఫికెట్లను పంపించారు. వాటిలో చాలావరకు నకిలీవిగా తేలడంతో తిరిగి ఆయా టీచర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరకు వారికున్న వికలత్వాన్ని నిర్ధారించి ఆ మేరకు మెడికల్ బోర్డు వికలత్వ సర్టిఫికెట్లను జిల్లా యంత్రాంగానికి అందించింది. ఇందులో ఆయా టీచర్లందరికీ అతి తక్కువస్థాయిలో వికలత్వం ఉన్నట్లు బయటపడింది. నిర్ధారించిన వైకల్యం ఉద్యోగ అర్హతకు సరితూగదని మెడికల్‌బోర్డు స్పష్టం చేసింది.

► నకిలీ కుల ధ్రువీకరణ కేటగిరీలో ముగ్గురిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఆ ముగ్గురు టీచర్లు ఓపెన్ కేటగిరీ (ఓసీ)కి చెందినప్పటికీ.. మున్నూరుకాపు కులానికి చెందినట్లు యంత్రాంగాన్ని తప్పుదోవపట్టించి సర్టిఫికెట్లు పొందినట్లు విచారణలో తేలింది.  
► తప్పుడు బోనఫైడ్లు సమర్పించి పలువురు ఉద్యోగాలు పొందారనే అభియోగాలు ఎదుర్కొంటున్న అంశంలో ఉపవిద్యాధికారి, మండల విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 16 మంది టీచర్లకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. విచారణ తుది నివేదిక కమిటీ రూపొందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు