డీఎస్పీ హుకుం!

2 Sep, 2017 03:56 IST|Sakshi
సాంబశివయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య
అన్నదమ్ముల మధ్య అప్పు చిచ్చు 
- చిట్‌ఫండ్‌ కంపెనీలో తమ్ముడి అప్పు తీర్చిన అన్న 
తిరిగి డబ్బులు ఇవ్వని తమ్ముడు.. కోర్టును ఆశ్రయించిన అన్న 
తమ్ముడి తరఫున అన్నను పిలిచి మందలించిన డీఎస్పీ 
పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న అన్న 
 
సాక్షి, మహబూబాబాద్‌: అన్నదమ్ముల మధ్య అప్పు చిచ్చు పెట్టింది. అప్పు కట్టలేనంటూ తమ్ముడు డీఎస్పీని ఆశ్రయించడంతో పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకొమ్మని చెప్పారు. లేదంటే, అనేక ఇబ్బందులు పడతావంటూ డీఎస్పీ దూషించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెద్దమనుషుల్లో పంచాయితీ ఉండగా, చేతి నుంచి డబ్బులు పోయే.. పోలీసులతో వేధింపులాయే.. అని మనస్తాపం చెందిన అన్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రానికి చెందిన బొల్లం సాంబశివయ్య(52), విశ్వేశ్వరయ్య అన్నదమ్ములు.  సాంబశివయ్య ఎరువులు, పురుగు మందుల దుకాణం, మెడికల్‌ షాపు,  విశ్వేశ్వరయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వేశ్వరయ్య ఓ చిట్‌ఫండ్‌ కంపెనీలో అప్పు తీసు కోగా సాంబశివయ్య జమానతుగా సంతకం పెట్టాడు. విశ్వేశ్వరయ్య చిట్‌ ఫండ్‌ కంపెనీలో అప్పుకట్టకపోవడంతో, జమానతుగా ఉన్న సాంబశివయ్య రూ.4.50 లక్షలు చెల్లించాడు. విశ్వేశ్వరయ్య ఆ డబ్బు తిరిగి  ఇవ్వకపోవడంతో   కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆ అప్పు మొత్తా న్ని విశ్వేశ్వరయ్య చెల్లించాల్సిందేనని సాంబశివయ్యకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. 
 
విశ్వేశ్వరయ్య తనకున్న ‘పరిచయం’తో.. 
విశ్వేశ్వరయ్య గుట్టుగా గుట్కాల దందా కూడా నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నెల్లికుదురు పోలీసు అధికారులతో ఎంతోకాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు స్థానికంగా చెబుతున్నారు. గతంలో తొర్రూరులో సీఐగా పనిచేసిన ప్రస్తుత డీఎస్పీతోనూ మంచి పరిచయమే ఉన్నట్టు భోగట్టా. దీంతో విశ్వేశ్వరయ్య తనకున్న చనువుమేరకు అప్పు చెల్లించలేనంటూ 15రోజుల క్రితం తొర్రూరు డీఎస్పీ రాజారత్నంను ఆశ్రయించాడు. సదరు డీఎస్పీ అన్న సాంబశివయ్యను పిలిపించి, అంత డబ్బు ఇవ్వలేడని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొమ్మని గట్టిగానే చెప్పి, అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. తెల్లవారుజామున సాంబశివయ్య ఇంట్లోనే క్రిమిసంహారక మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి, మహబూబాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. 
 
ఆసుపత్రి వద్ద హైడ్రామా 
మహబూబాబాద్‌ ప్రభుత్వాసుప్రతిలో శుక్రవారం రోజంతా హైడ్రామా నడిచింది. డీఎస్పీ వేధింపుల వల్లే విశ్వేశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ దావానలంలా వ్యాపించి, జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ వేధింపులవల్లే అంటూ మీడియాలోనూ వార్తలొచ్చాయి.  అంతసేపూ డీఎస్పీ వేధింపుల వల్లే విశ్వేశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన కుటుంబసభ్యులు, ఆ తర్వాత మాటమార్చారు. డీఎస్పీ తరఫున కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అక్కడున్నవారితో, కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ డబ్బులు ఇప్పిస్తామని, డీఎస్పీతో ఎలాంటి ఇబ్బంది ఉండవని నమ్మబలికారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపిస్తున్నామన్నారు. 
 
డీఎస్పీ వేధింపుల వల్లే... 
మాకు, మా బాబాయికి డబ్బుల విషయమై గొడవ నడుస్తోంది. మా బాబాయి రూ.4.5 లక్షలు ఇవ్వాలె. ఇవ్వకుండా తొర్రూరు డీఎస్పీని ఆశ్రయించగా 15 రోజుల క్రితం డీఎస్పీ మా నాన్నను రెండుసార్లు పిలిపించిండు. నేను కూడా వెంట వెళ్లా. ఒక్క తల్లికి పుట్టలేదా?’అంటూ పరుష పదజాలం తో మాట్లాడిండు. అంత డబ్బు కట్టలేడు. లేకుంటే దుకాణాలపై నిఘా పెడితే ఇబ్బందులు పడతామంటూ భయభ్రాంతులకు గురిచేసిండు.  అప్పటి నుంచే ముభావంగా ఉండు. –బొల్లం ప్రవీణ్, మృతుడి కొడుకు  
 
నెల రోజుల క్రితం వచ్చారు 
ఈ విషయమై తొర్రూరు డీఎస్పీ కె. రాజారత్నంని వివరణ కోరగా, నెల   క్రితం అన్నదమ్ములిద్దరూ పెద్ద మనుషులతో కలిసి తన వద్దకు వచ్చారని తెలిపారు. పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొమ్మని చెప్పానే తప్పా తానేమీ అనలేదన్నారు. ‘నేను చెప్పిన రెండు రోజులకో, మూడు రోజులకో ఆత్మహత్య చేసుకుంటే నన్ను అనాలి. నెల తర్వాత ఆత్మహత్య చేసుకుంటే నాకేం సంబంధం. అతడి కొడుకు నాపై ఆరోపణలు ఎందుకు చేస్తుండో అర్థం కావడం లేదు’ అని చెప్పారు.
మరిన్ని వార్తలు