ఫలక్‌నుమా బాంబు..ఎల్లయ్య మానసిక రోగి

29 Nov, 2017 20:35 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ

అతనో మానసిక రోగి

ఫలక్‌నుమాలో బాంబు ఉందన్న వ్యక్తి అరెస్టు

వివరాలు వెల్లడించిన డీసీపీ సత్యనారాయణ

హైదరాబాద్‌: ఫలక్‌నుమా ప్యాలెస్‌ లో బాంబు ఉందంటూ 108కి డయల్‌ చేసిన వ్యక్తి ఆచూకీని దక్షిణ మండలం పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి మానసిక రుగ్మతతో బాధ పడుతూ ఈ కాల్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారా యణ బుధవారం తన కార్యాల యంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం జీఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8.45కు, అమెరికా అ«ధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌ 8.54కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రవేశించారు. సరిగ్గా రాత్రి 8.43కు ఓ గుర్తు తెలియని వ్యక్తి 108ృఈఎంఆర్‌ఐ అంబులెన్స్‌కు కాల్‌ చేసి ప్యాలెస్‌లో బాంబు పెట్టారంటూ భయపడుతూ... వణుకుతున్న స్వరంతో సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఈ వివరాలను 100 డయల్‌తో పాటు పోలీస్‌ సెక్యూరిటీ విభాగాలకు సమాచారం అందించారు.

పోలీసులు ఎలాంటి ఆందోళనలు చెందకుండా ప్యాలెస్‌లో గట్టి బందోబస్తు కొనసాగిస్తూ కాల్‌ చేసిన వ్యక్తిపై ఆరా తీసేందుకు పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తి మల్కాజ్‌గిరికి చెందిన బొంత ఎల్లయ్య(60)గా గుర్తించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఈయనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. కోర్టు ఆదేశానుసారం చికిత్స అనంతరం ఈ నెల 24న ఇంటికి తీసుకొచ్చారు. అతడు బయటికి వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా జీఈ సదస్సు విషయమే మారుమోగుతుండటంతో బాంబు ఉందంటూ ఫోన్‌ చేసి బెదిరించాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే 27న ఫోన్‌ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి 108కి ఫోన్‌ చేసి బాంబు అంటూ కాల్‌ చేశాడు. కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు సమాచారం సేకరించారు. సైబరాబాద్‌ పరిధిలో తన కొడుకుతో ఆటోలో వెళుతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే మానసిక స్థితి బాగోలేని ఎల్లయ్యను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలిస్తామని డీసీపీ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు