బోనాలకు సకల ఏర్పాట్లు

22 Jun, 2014 01:10 IST|Sakshi
బోనాలకు సకల ఏర్పాట్లు
  • సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ముఖేష్ కుమార్‌మీనా
  • సాక్షి, సిటీబ్యూరో: రాష్ర్ట పండుగగా గుర్తించిన బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. బోనాలు, రంజాన్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో శనివారం జరిగిన  వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు.

    జూన్ 29న గోల్కొండలోని అక్కన్న మాదన్న ఆలయంలో, జూలై 13న ఉజ్జయిని మహంకాళి , 20న లాల్ దర్వాజ ఆలయంలో నిర్వహించే బోనాలు ప్రధానమైనవని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా జూన్ 29 నుంచి జూలై 29 వరకు (ఈదుల్ ఫితర్) మసీదులు, ప్రార్థనా స్థలాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.20 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, ఇతరత్రా పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.

    బోనాలు నిర్వహించే 10 ప్రధాన దేవాలయాల్లో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారీకేడ్లు, మండపాలు, విద్యుత్ దీపాలంకరణ చే యిస్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. రంజాన్ పనుల నిమిత్తం రూ.30 లక్షలు అవసరం కాగా, ఇప్పటికి రూ.20 లక్షలు అందాయని, మిగిలిన నిధులు మంజూరు చేయాల్సిందిగా సీఎస్‌ను కోరారు. సీఎస్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో నిధులను విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

    వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అనంతరం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమైన కలెక్టర్..  రంజాన్, బోనాలు ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వై.లింగారెడ్డి, విష్ణు, మైనార్టీ సంక్షేమాధికారి సూరజ్‌కుమార్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు