బోనాల వేడుకలు ప్రారంభం

20 Jul, 2014 09:20 IST|Sakshi
బోనాల వేడుకలు ప్రారంభం

 హైదరాబాద్: మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అభిషేకంతో పూజలు మొదలు పెట్టారు. పాతబస్తి లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి  ఆలయానికి  భక్తులు పొటెత్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అమ్మవారికి బోనాలు  సమర్పించారు. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు, యువతులు, పిల్లలు ఎంతో ఆనందంగా అమ్మవారికి సమర్పించడానికి బోనాలను తీసుకువస్తున్నారు. ఆలయాల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బోనాలు పండుగ ఇది.  బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాలలో  అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు. బోనాలు పండుగ సందర్భంగా రేపు సోమవారం  ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

 బోనాల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు  చేశారు. పాతబస్తీలో 300 దేవాలయాల్లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నారు. 30 ప్రత్యేక, 9 కంపెనీల కేంద్ర బలగాలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. రద్దీ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అక్కన్న-మాదన్న దేవాలయం, లాల్‌దర్వాజా, మహాంకాళి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు