పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

28 Jul, 2019 10:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది.

తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది. 

మరిన్ని వార్తలు