ఘనంగా బోనాల ఉత్సవాలు

11 Jun, 2019 01:40 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. చిత్రంలో ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ

జూలై 4న గోల్కొండ, 21న సికింద్రాబాద్, 28న పాతబస్తీలో

బోనాల పండగా ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఈ మేరకు బోనాల పండగ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు, వివిధ పనుల కోసం జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.22 కోట్లు కేటాయించనుందని తెలిపారు. జూలై 4న గోల్కొండ, 21న సికింద్రాబాద్, 28న పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ఉంటాయని తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ 3 లక్షల తాగునీటి ప్యాకెట్లను ఏర్పాట్లు చేసిందని, ఆర్‌ అండ్‌ బీ ద్వారా దేవాలయాల వద్ద బారికేడింగ్, విద్యుత్‌కు అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సాంస్కృతిక శాఖ సహకారంతో దేవాలయాల వద్ద సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బోనాల నేపథ్యంలో భక్తుల కోసం అదనంగా మెట్రో ట్రిప్‌లు తిరిగేలా చూడాలన్నారు. ఉత్సవాలకు అవసరమైన ఏనుగును చూడాల్సిందిగా అటవీ శాఖకు సూచించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు అన్ని పనులను ముందుగానే పూర్తి చేయాలన్నారు. 

ఈసారి మరింత మెరుగ్గా.. 
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలను పంపుతామన్నారు. పురోహితులను, ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, ఇన్‌చార్జీ కమిషనర్, లా అండ్‌ ఆర్డర్‌ డీజీ జితేందర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎండీ వాటర్‌ వర్క్స్‌ దానకిషోర్, ఎండోమెంట్స్‌ కమిషనర్‌ అనీల్‌ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ట్రాన్స్‌ కో డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు