26 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం 

9 Jun, 2020 09:10 IST|Sakshi

జూలై 19న అమ్మవారికి బోనాల సమర్పణ 

సాక్షి, యాకుత్‌పురా : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ అధ్యక్షుడు జి.రాజారత్నం తెలిపారు. ఆలయ 72వ వార్షిక బోనాల నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రార్థనా మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చారిత్రాత్మకమైన ఈ దేవాలయాన్ని 77 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం సోమవారం తెరిచామన్నారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించామన్నారు.

బోనాల పండగ నిర్వహించే 11 రోజులు అన్ని పూజలు నిర్వహించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించమని వేడుకుంటామన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు శుక్రవారాల పాటు బోనాల వేడుకలు నిర్వహించనున్నామన్నారు. కుంకుమార్చనను ఈ నెల 26న, జూలై 3, 10, 17, 24వ తేదీలతో నిర్వహిస్తామన్నారు. జూలై 10న అమ్మవారి కలశ స్థాపన, మహాభిషేకం నిర్వహించి ధ్వజారోహణతో 11 రోజుల పాటు నిర్వహించే బోనాల జాతరను ప్రారంభిస్తామన్నారు. జూలై 11 నుంచి 18వ తేదీ వరకు అమ్మవారికి వివిధ పూజలు, 19న బోనాల పండగ సందర్భంగా అమ్మవారికి బోనాల సమర్పణ, శాంతి కల్యాణం నిర్వహిస్తామన్నారు. 20న పోతురాజుల స్వాగతం, రంగం, భవిష్యవాణి నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.

ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా బోనాల పండగ రోజున జిల్లాల నుంచి భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జూలై 10 నుంచి 17వ తేదీ వరకు భౌతిక దురాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు వీలు కల్పిస్తున్నామన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని... ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్, ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శోభ, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌లకు విజ్ఞప్తి పత్రాలను అందజేశామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి కె.దత్తాత్రేయ, కోశాధికారి ఎ.సతీష్, సంయుక్త కార్యదర్శి చేతన్‌ సూరి, కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్‌.పి.క్రాంతి కుమార్, సభ్యులు ఎం.వినోద్, ఎం.ముఖేశ్‌లు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు