బోనం.. బొనాంజా

11 Jul, 2018 11:58 IST|Sakshi

బోనాల పండగ ఏర్పాట్లకు రూ.15 కోట్లు  

నిధుల ఖర్చుపై అనుమానాలు 

సౌకర్యాల కల్పనపై ఏటా నిర్లక్ష్యమే 

గతేడాది పనులు ఇప్పటికీ పూర్తికాని వైనం 

పక్కదారి పడుతున్న నిధులు

సాక్షి, హైదరాబాద్‌ : బోనాల పండగ...కాదు కాదు ‘కార్పొరేటర్ల పండగ’ మళ్లీ వచ్చింది. ఏటా మాదిరిగానే బోనాలకు ముందుగా నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇంకేముంది కార్పొరేటర్లకు పండగే మరి. ఎందుకంటే బోనాల పనులకు సంబంధించి పెత్తనమంతా వారిదే. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రభుత్వం రూ.5 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసింది. బోనాల ఉత్సవాన్ని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా ఉత్సాహంగా నిర్వహించేందుకు ఈ నిధులు ఇచ్చారు. అయితే ఏటా పండుగ పేరిట ఇలా విడుదలవుతున్న నిధుల్లో చాలా వరకు కార్పొరేటర్ల ఖాతాల్లోకే మళ్లుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పండుగ సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయాలకు దారితీసే మార్గాలను, రహదారులను తీర్చిదిద్దడం.. ఆలయాలకు సున్నాలు, రంగులు వేయడం, అవసరమైన ప్రాంతాల్లో షాబాద్‌ ఫ్లోరింగ్‌లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు వంటి పనులు చేయాలి. కానీ.. వీటిల్లో చాలా వరకు చేయకుండానే చేసినట్లు చూపుతూ నిధులు దారి మళ్లిస్తుండటం పరిపాటిగా మారింది.

వాస్తవానికి ఆలయాల పరిసరాల్లో మాత్రమే ఈ పండగ పనులు చేయాల్సి ఉండగా, ఎక్కడ పడితే అక్కడ ఈ పనులను చేసినట్లు చూపుతున్నారు.  అంతే కాదు.. పండుగలు మొదలయ్యేనాటికే పనులు పూర్తికావాల్సి ఉండగా, పండగలు ముగిశాక సంవత్సరమైనా పనులు పూర్తి కావడం లేదు.  మరుసటి సంవత్సరం మళ్లీ  పండుగ పేరిట నిధులు మంజూరవుతాయి కాబట్టి..పాత పనుల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ బిల్లుల చెల్లింపులు మాత్రం జరిగిపోతాయి. అవి కార్పొరేటర్ల జేబుల్లోకి చేరతాయి. కార్పొరేటర్లు, స్థానిక అధికారులు పరస్పర సహకారంతో ఎవరి శక్తిమేరకు వారు ప్రయోజనం పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. గత సంవత్సరం బోనాల కోసం రూ.10 కోట్లు మంజూరు కాగా, ఆ నిధుల్లో ఇప్పటి వరకు ఇంకా రూ.2 కోట్లు ఖర్చు కాలేదు. అవలా ఉండగానే తాజాగా మళ్లీ రూ.15 కోట్లు మంజూరయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  

తూతూమంత్రంగా.. 
పండుగ పేరిట చేసే పనులు తూతూమంత్రంగానే చేస్తారు. మూణ్నాళ్ల ముచ్చట కోసం చేసే పనులే కావడంతో నాణ్యత గురించి పట్టించుకునేవారుండరు. రోడ్ల పేరిట ఖర్చు చూపినప్పటికీ.. ఎప్పటి కప్పుడు రోడ్ల మరమ్మతుల పేరిట నిర్వహణ ఖర్చుల నుంచి వెచ్చిస్తూనే ఉంటారు. బోనాల పేరిట ప్రత్యేకంగా నిధులు చూపడం తప్ప చాలా పనులు సాధారణ నిర్వహణ కిందే జరిగిపోతుంటాయి. వాటిని కూడా వీటిల్లో కలిపేస్తారు.  పండుగల ఏర్పాట్ల పనులు జోన్లు, సర్కిళ్ల వారీగా జరుగుతాయి కాబట్టి పూర్తయిన పనుల వివరాలు ఎప్పటికప్పుడు  ప్రధాన కార్యాలయానికి చేరవు. 

ఓవైపు ప్రతిపాదనలు.. మరోవైపు పనులు 
వచ్చే ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని డివిజన్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, కొన్ని డివిజన్లలో ఇంకా ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. పండుగ పనుల ప్రతిపాదనల అధికారం కార్పొరేటర్లకే అప్పగించారు. స్థానిక కాలనీ సంఘాలు, ఎన్జీఓలు తదితరులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా మేయర్‌ సూచించారు. కానీ.. వారితో సమావేశాలు మొక్కుబడి తంతే. కొన్ని డివిజన్లలో అవీ జరగవు. కార్పొరేటర్‌ ఏది చెబితే అదే పని. స్థానిక  ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేసే వారు కొందరు కాగా, అది కూడా పట్టించుకోని వారు మరికొందరు. మొత్తానికి బోనాల పండుగ  నిధుల్లో కార్పొరేటర్లదే పెత్తనం కావడంతో ప్రజలకంటే వారికే పెద్ద పండగ.  

రూ. 2 కోట్ల పనులు రద్దు చేశాం 
వివిధ పండుగల పేరిట మంజూరైన నిధులు ఏడాదంతా ఖర్చు చేసే పద్ధతికి స్వస్తి పలికాం. ఏ పండుగకు మంజూరైన నిధులు ఆ పండుగకే వెచ్చించేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. గత సంవత్సరం బోనాల పండుగ ఏర్పాట్లకు మంజూరైన నిధుల్లో దాదాపు రూ. 2 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. దాంతో ఆ పనుల్నే రద్దు చేశాం. గతంలో మాదిరిగా వాటిని ఎప్పుడైనా ఖర్చు చేసే అవకాశం లేకుండా తగుచర్యలు తీసుకున్నాం.   అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.  
– జియాఉద్దీన్, చీఫ్‌ ఇంజినీర్‌ (జీహెచ్‌ఎంసీ)

ఈసారి బోనాల పండుగకు సంబంధించి  ఇప్పటికి కొన్ని ప్రతిపాదనలే రాగా, చాలా ప్రాంతాల్లో ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో  ఇప్పటికే ప్రారంభమైన పనుల్ని కూడా బోనాల  పండుగ పద్దులో చేర్చే అవకాశాలున్నాయి 

2018–నిధుల మంజూరు.. పనుల పురోగతి..(రూ.లక్షల్లో)  
జోన్ల వారీగా..  

జోన్‌             మంజూరు     టెండరుదశలో    పనుల పురోగతి 
ఎల్‌బీనగర్‌    119.00          84.95            00.00 
చార్మినార్‌      841.77         207.06          56.42 
ఖైరతాబాద్‌    293.45         107.30          16.00 
శేరిలింగంపల్లి  55.83            4.30             00.00 
కూకట్‌పల్లి     39.00            11.17            00.00 
సికింద్రాబాద్‌  187.41           121.43          9.98 
మొత్తం        1536.46          536.21         82.40 

గత సంవత్సరం (2017) 
నిధుల మంజూరు.. పూర్తయిన పనులకు వెచ్చించిన 
నిధులు రూ. లక్షల్లో  ఇలా
..  
జోన్‌            మంజూరు     పూర్తయిన పనులు  
ఎల్‌బీనగర్‌    164.89          38.78 
చార్మినార్‌      535.65         418.50 
ఖైరతాబాద్‌    139.22         90.28 
శేరిలింగంపల్లి  38.76           34.81 
కూకట్‌పల్లి     29.62           29.62 
సికింద్రాబాద్‌   257.27         231.98 
మొత్తం         1165.41        843.97 
గత సంవత్సరానికి సంబంధించిన పనుల్లో  దాదాపు రూ. 17 లక్షల పనులు ఇంకా కొనసాగుతూనే  ఉన్నాయి. మరో రూ.1.05 కోట్ల పనులు ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు.      

మరిన్ని వార్తలు