ఇక 'కీలు' గుర్రమే!

20 Aug, 2018 02:02 IST|Sakshi

ఆసియాలోనే తొలిసారిగా కుక్కకు తుంటి ఎముక కీలు మార్పిడి 

ఇంతకాలం నడవడానికి ఇబ్బందులు..

ఇక సమస్యలు ఉండవంటున్న వైద్యులు

హైదరాబాద్‌: ఖర్చుకు వెనుకాడకుండా పెంపుడు జంతువులకు అధునాతన వైద్యం అందిస్తున్నారు జంతుప్రేమికులు. ఆసియాలోనే మొదటిసారిగా డ్యూయల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌(తుంటి ఎముక కీలు మార్పిడి) శస్త్ర చికిత్సకు నగరంలోని ‘డాక్టర్‌ డాగ్‌ పెట్‌’హాస్పిటల్‌ వేదికగా నిలిచింది. డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌ ఆది వారం శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్‌ ఎనిమిదేళ్లుగా లాబ్రడార్‌ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు.

ఈ శునకం కొంతకాలంగా తుంటి కీలు నొప్పితో సతమతమవుతోంది. దీంతో బం జారాహిల్స్‌లోని డాక్టర్‌ డాగ్‌ పెట్‌ హాస్పిటల్‌కు శునకాన్ని తీసుకెళ్లారు. శునకాన్ని పరిశీలించిన డాక్టర్‌ రమేశ్‌ వివిధ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. విదేశాల నుంచి పరికరాలను తెప్పించి ఈ నెల 17న డ్యూయల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగు గంటలపాటు వైద్యుల బృందం నిర్వహించిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ప్రస్తుతం శునకం కోలుకుంటోంది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో నడుస్తుందని డాక్టర్‌ రమేశ్‌ తెలిపారు.  

పెంపుడు జంతువుల్లో సైతం.. 
పెంపుడు జంతువుల్లో ఆర్థరైటిస్‌ సమస్య వస్తుందని డాక్టర్‌ రమేశ్‌ తెలిపారు. అయితే, డ్యూయల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదన్నారు. మనుషుల్లో సైతం తుంటి కీలు, మోకాళ్ల చిప్పల మార్పిడి అనేవి సాధారణమయ్యాయని చెప్పారు. పెంపుడు జంతువుల్లో సైతం ఈ చికిత్స అవసరముంటుందని చెప్పారు. ఆసియాలోనే మొదటిసారిగా శునకానికి డ్యూయల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌ చికిత్స నిర్వహించినట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు