‘రోడ్ల మరమ్మతులకు 79 బృందాలు’

17 Jul, 2018 19:28 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరంలోని రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత యుద్ద ప్రాతిపదికన చేపట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీ ఇంజనీర్లతో పాటు, జెఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు  కూడా పాల్గొన్నారు. మేయర్‌ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ నగరంలో మొత్తం 9 వేల కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా వీటిలో ప్రధానంగా 320 కి.మీ రోడ్లను హెచ్‌ఆర్‌డీసీఎల్‌ నిర్వహిస్తోంది. గతేడాది జూలై 1వ తేదీ నుంచి నేటి వరకు నగరంలోని రోడ్లపై 3,141 గుంతలు ఏర్పడ్డాయి. వీటిలో 772 గుంతలను పూడ్చాం. మిగిలిన వాటిని రెండు రోజుల్లో పూడ్చివేస్తాం. 2017 జూన్‌ 1 నుంచి 2018 జూన్‌ 30 వరకు 50,100 పాట్‌హోల్స్‌ను పూడ్చివేశాం. 

రోడ్ల మరమ్మతులకు ప్రత్యేంగా 79 ఇన్‌స్టాంట్‌ రిపేర్‌ టీమ్‌లను ఏర్పాటు చేశాం. వర్షకాలంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం, గుంతలు పూడ్చడానికి త్రిముఖ వ్యుహం  అవలంభించబోతున్నాం. ప్రతిరోజు ఇంజనీర్లు తమ ప్రాంతాల్లో సంబంధిత ప్రజా ప్రతినిధులతో కలిసి రోడ్లను తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటాం. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేస్తాం. జలమండలి, మెట్రోరైలుతో పాటు వివిధ పనుల నిమిత్తం తవ్విన రోడ్లను వెంటనే పునరుద్దరించాలని కోరాం. నిరంతర వర్షాల కారణంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నాం. వచ్చే మూడు నెలలు కీలక సమయం కానున్నందున.. ఎల్‌ అండ్‌ టీ, వాటర్‌ బోర్డు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర విభాగాల ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తవ్వకాలు, గుంతల పూడ్చివేతపై ప్రత్యేక కార్యచరణ రూపొందించుతామ’ని తెలిపారు.

మరిన్ని వార్తలు