‘మరిన్ని రోబోటిక్‌ యంత్రాలు అందుబాటులోకి’

5 Nov, 2019 14:08 IST|Sakshi

 

సాక్షి, హైదరాబాద్‌ : మ్యాన్‌హోల్‌లోని చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హైటెక్‌సిటీలో ప్రారంభించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మొట్ట మొదటిసారిగా హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని తీసుకొచ్చామని అన్నారు. గతంలో మ్యాన్‌హోల్స్ లోని చెత్త తీసే క్రమంలో దురదృష్టవశాత్తు పలువురు కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ యంత్రం తొడ్పడుతుందని తెలిపారు.

అలాగే కొత్త టెక్నాలజీతో తయారైన రోబోటిక్ యంత్రం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నామని, ఈ యంత్రంతో 24 గంటలు పని చేయవచ్చని పేర్కొన్నారు. దీనికి నాలుగు కెమెరాలతో పాటు రోబోటిక్‌ లెగ్స్‌, ఆర్మ్స్‌, యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ డిస్‌ప్లేకు అనుసంధానంగా ఉంటాయన్నారు. ఈ రోబో యంత్రాలకు రహేజా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని రోబోటిక్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరి చందన హాజరయ్యారు.

మరిన్ని వార్తలు