ఫారెస్ట్, రెవెన్యూ ‘బార్డర్‌ వార్‌’

17 Nov, 2019 06:07 IST|Sakshi

కొలిక్కిరాని భూ వివాదాలు

సమస్య పరిష్కారంలో రెవెన్యూ శాఖ జాప్యం

అసహనం వ్యక్తం చేస్తున్న అటవీ శాఖ

వేర్వేరు రికార్డులతోనే సమస్య అంటున్న రెవెన్యూ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: అటవీ, రెవెన్యూ శాఖల మధ్య హద్దుల వివాదాలు ఎంతకీ తెగడం లేదు. ఏవి అటవీ భూములు, ఏవి రెవెన్యూ భూములు అన్న దానిపై స్పష్టత సాధించే ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. ఈ రెండు శాఖల మధ్య భూవివాదాలకు సంబంధించి రికార్డుల రూపంలో స్పష్టత సాధించకపోవడం సమస్యగా మారింది. వివాదాల పరిష్కారానికి రెవెన్యూ శాఖ తగిన చొరవ తీసుకోవడం లేదని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పంచాయతీకి తాము తెరదించాలని చూస్తున్నా రెవెన్యూశాఖ పెద్దగా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు.

గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు భూములకు సంబంధించి అటవీశాఖ వద్ద పక్కా రికార్డులున్నా, వివాదాలుగా పేర్కొంటున్న భూముల్లో సమస్య పరిష్కారానికి రెవెన్యూశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.అయితే ఏ శాఖకు ఆ శాఖ వేర్వేరుగా రికార్డులను నిర్వహించడంతో పాటు, వాటి నమోదు కూడా సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పూరిస్థాయిలో అటవీ భూముల సర్వే చేయకపోవడం, తమ భూమి అంటే తమ భూమి అని రెండుశాఖలు రికార్డులకు ఎక్కించడం వల్ల వివాదాలు ఏర్పడ్డాయని అంటున్నారు.

మొత్తం 60 లక్షల ఎకరాల్లో...
తెలంగాణలో మొత్తం 60 లక్షల 646 ఎకరాల మేర అటవీశాఖ భూమి ఉన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 49.80 లక్షల ఎకరాలు ఎలాంటి వివాదాలు లేకుండా, రికార్డుల పరంగా క్లియర్‌గా ఉన్నాయి. ఇటీవల వరకు సిద్ధం చేసిన లెక్కల ప్రకారం ప్రధానంగా పదిన్నర లక్షల ఎకరాల్లోని భూముల పరిధిలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 3.44 లక్షల ఎకరాలుండగా అందులో అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు ఈ వివాదాల్లో ఉంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 38 వేల ఎకరాలుండగా, వాటిలో 26 వేల ఎకరాల్లో.. కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకుగాను 1.50 లక్షల ఎకరాల్లో వివాదాలు, వికారాబాద్‌ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకు గాను 42వేల ఎకరాలు, నిర్మల్‌ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకు గాను 70 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52 వేల ఎకరాలకు గాను 13 వేల ఎకరాలు భూ వివాదాల్లో ఉన్నట్టుగా ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే అటవీ శాఖకు చెందిన ఎలాంటి వివాదాలకు తావులేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి గత నెల చివరి వరకు ఇంటిగ్రేటెడ్‌Š ల్యాండ్‌ రికార్డ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌–నోషనల్‌ ఖాటా మార్కింగ్‌)లో 28.50 లక్షల ఎకరాలు రికార్డ్‌ అయ్యాయి. ఇంకా 21.30 లక్షల ఎకరాలు నోషనల్‌ ఖాటా మార్కింగ్‌ చేపట్టాల్సి ఉంది.

మరిన్ని వార్తలు