‘మైకు’కు ‘లాఠీ’అండ

11 Nov, 2018 14:06 IST|Sakshi
పోలీసు బందోబస్తు మధ్య గ్రామాలకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

వేమనపల్లి(బెల్లంపల్లి): మూడు రోజుల క్రితం బెల్లంపల్లిలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలియడం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు పెంచారు. శనివారం బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 7గంటలకే తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత తీరం వెంటనున్న కల్లంపల్లి, ముక్కిడిగూడెం, జాజులపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమం ఆరంభమైంది. డీసీపీ వేణుగోపాల్‌రావు ఆదేశాలతో చెన్నూర్‌ రూరల్‌ సీఐ జగదీష్, ఎస్సై భూమేష్‌ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు.

ఆయా గ్రామాల్లో పోలీస్‌ నిఘా ఏర్పాటు చేశారు. అనుమానిత, అపరిచిత వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. 12 కిలోమీటర్ల దారి పొడవునా కల్వర్టులు, రోడ్డును క్షణ్ణంగా పరిశీలించారు. కూతవేటు దూరంలో ఉన్న ప్రాణహిత ఫెర్రీ పాయింట్‌ (ఘాట్‌)లపై దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణకు పడవల ద్వారా రాకపోకలు సాగించేవారిపై నిఘా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  


 

మరిన్ని వార్తలు