బోర్ల వినియోగం రాష్ట్రంలోనే అధికం

27 Nov, 2017 01:48 IST|Sakshi

కేంద్ర జల వనరుల శాఖ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో భూగర్భ జలాలను తెలంగాణ లోనే అధికంగా వినియోగిస్తున్నారని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. భూగర్భ జలాల వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ఆ నీటిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో బోర్లను వేస్తోందని తెలిపింది. రాష్ట్రంలో ఒక్కో బోరు ఏర్పాటు చేసేందుకు సగటున రూ.41,960 మేర ఖర్చు చేస్తున్నారని, ఏటా వాటి నిర్వహణకు రూ.4,193 ఖర్చు పెడుతున్నారని వెల్లడించింది.

తమిళనాడు, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది. దేశవ్యాప్తంగా చిన్న నీటి వనరుల ద్వారా నీటి వినియోగంపై కేంద్ర జల వనరుల శాఖ అధ్యయనం చేసింది. గతంతో పోలిస్తే వ్యవసా యానికి భూగర్భజలాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపింది. 2013–14 నాటికి తెలంగాణలో ఉన్న 14.56 లక్షల బోరు మోటార్ల పరిధిలో అధ్యయనం చేయగా.. ఇందులో 13.55 లక్షల బోర్లే  పనిచేస్తున్నాయంది. వీటి కింద ఖరీఫ్‌లో గరిష్టంగా 10.12 లక్షల హెక్టార్లు, రబీలో 7.17 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోందని తెలిపింది.  

మరిన్ని వార్తలు