ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన పసికందు..

16 Oct, 2019 20:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన ఓ చిన్నారి ముళ్ల పొదలపాలైంది. కన్న మమకారం మరిచిన తల్లి అప్పుడే పుట్టిన ముక్కపచ్చలారని తన కూతుర్ని ముళ్లపొదల్లో విసిరేసింది. ఈ హృ​​దయ విదారక ఘటన బుధవారం నిమ్స్‌ ఆవరణలో బయట పడింది. నిమ్స్‌ మిలినియం బ్లాక్‌ వెనుక ప్రహరివద్ద చిన్నపాటి ఏడుపు శబ్ధం వినిపిస్తుంది. 

దీంతో అవుట్‌ పోస్ట్‌ పోలీసులు ఏడుపు వినిపిస్తున్న ప్రాంతానికి వెళ్లి చూడగా, ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి ఉన్న చంటిపాప కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని నిమ్స్‌ అత్యవర చికిత్సా విభాగానికి తరలించారు. చికిత్స అనంతరం బిడ్డ సంరక్షణకు శిశువిహార్‌కు తరలించనున్నట్లు పంజగుట్ట పోలీసులు చెప్పారు. అయితే ఆ బిడ్డను ఎవరు వదిలి వెళ్లారన్న దానిపై సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆడపిల్ల కావడంతోనే ఆ బిడ్డను వదిలి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

మరోవైపు ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందిస్తూ నవజాత శిశువులను రోడ్లపై వదిలేయడం నెలలో ఇది మూడో ఘటన అని అన్నారు. పిల్లలకు బతికే హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఓ పథకం రూపొందించాలని, లేదా ఊయల పథకాన్నిసమర్థవంతంగా నిర్వహించేలా  స్త్రీ శిశు సంక్షేమ శాఖను ఆదేశించాలని కోరారు.

మరిన్ని వార్తలు