కేటీఆర్, లోకేశ్ పైసల కుస్తీ!

5 May, 2015 09:48 IST|Sakshi
కేటీఆర్, లోకేశ్ పైసల కుస్తీ!

హైదరాబాద్: ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం సవాళ్లు.. రుసరుసలు, ఎద్దేవాలు, ఖండనలు, తిట్లు, చివాట్లతో తీరిక లేకుండా ఉండగా.. వారికంటే తామేం తక్కువ అని వారిద్దరి కుమారులు కే తారక రామరావు, నారా లోకేశ్ నాయుడు కుస్తీలకు దిగారు. అయితే, అదేదో ప్రేక్షకుల మధ్యనో, నిర్ణీత ప్రాంతంలోనో కాదు.. ఆంధ్ర తెలంగాణలో అయితే అసలే కాదు. అది అమెరికాలో.. కుస్తీ అంటే బస్తీ మే సవాల్ అని జబ్బలు చరిచి కలబడే కుస్తీ కాదు. తమ రాష్ట్రాలకు పెట్టుబడుల ప్రవాహాన్ని పారించే కుస్తీ.

కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రాలకు పెట్టుబడులను భారీ సంఖ్యలో తీసుకొచ్చి.. ఇటు రాష్ట్ర ప్రజల మెప్పును, తమ కుమారులు మంచి పనిమంతులే అని తమ తండ్రుల నుంచి కూడా మెప్పులు పొందేందుకు వెళుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే లోకేశ్ రెండు రోజుల ముందుగానే అమెరికా బయలుదేరి ఉండగా.. తాజాగా మంగళవారం కేటీఆర్ బయలు దేరారు. రెండు వారాలపాటు జరగనున్న వారిద్దరి టూర్లలో పెట్టుబడికి తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సదుపాయాలను కల్పించనున్నాయో వివరించనున్నారు.

వీరిద్దరికి అక్కడి పరిస్థితులు కూడా కొంత తెలుసు. ఎందుకంటే లోకేశ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయగా.. కేటీఆర్ న్యూయార్క్ యూనివర్సిటీలోని బారుఖ్ కాలేజీలో చదివాడు. అయితే, బాధ్యతల రీత్యా మాత్రం కేటీఆర్కే కాస్త అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం తెలంగాణలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. దీంతో ఆయన పారిశ్రామిక వేత్తలకు ఐటీ, ఏయిరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో న్యూయార్క్, డల్లాస్వంటి ప్రముఖ నగరాల్లో ప్రెజెంటేషన్ చేయనున్నారు. లోకేశ్ ఏ అంశంపై ప్రజెంటేషన్ ఇస్తారో తెలియదు. కాకపోతే ప్రభుత్వంలో ఏ పదవిలేని లోకేశ్కు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న అతడి స్నేహితుడు ఎస్ అబీష్ట ఉన్నారు.

అధికార వర్గాల సమాచారం మేరకు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లతో లోకేశ్ సమావేశమవుతారని తెలిసింది. ఇక ఇంత జరుగుతున్నా తమ మధ్య ఎలాంటి పోటీలు లేవని, కేవలం బ్రాండ్ ఆంధ్ర, బ్రాండ్ తెలంగాణ, భ్రాండ్ హైదరాబాద్ కోసమే తమ ప్రణాళికలు, కార్యచరణ అని చెప్తున్నారు. ఏది ఏమైనా తండ్రుల్లాగే పోటీపడుతున్న ఈ యువనాయకులు అమెరికా నుంచి ఎన్ని కోట్ల పెట్టుబడులు తమ రాష్ట్రాలకు తీసుకొచ్చి శబాష్ అనిపించుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు