రెండు విడతల్లో  పాలమూరు – రంగారెడ్డి

4 Dec, 2018 08:11 IST|Sakshi
రాహుల్‌గాంధీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న డీకే అరుణ, కూతురు స్నిగ్ధారెడ్డి, శివసేనారెడ్డి తదితరులు

‘ప్రజాకూటమి’ గెలిస్తే విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

చీకటి ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్‌ – మోదీ

గద్వాల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

హాజరైన ఉత్తమ్, సురవరం సుధాకర్‌రెడ్డి, గద్దర్, మంద కృష్ణ

సాక్షి, గద్వాల: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రెండు విడతల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం గద్వాలలో మహాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీకి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మద్దతిచ్చారని, దేశ ప్రజలను ఎన్నో కష్టాల పాల్జేసిన నోట్ల రద్దుకు వత్తాసు పలికారని, బీడీ కార్మికుల యాజమాన్యాలకు నష్టం కలిగించిన జీఎస్టీని కొనియాడారని విమర్శించారు.

‘కేసీఆర్‌కు ఒకే లక్ష్యం ఉంది.. తెలంగాణలో తన కుటుంబం, కేంద్రంలో మోదీ పరిపాలించాలి.. టీఆర్‌ఎస్‌ పేరుకు మరో ఎస్‌ జోడించాలని, ఇది టీఆర్‌ఎస్‌ కాదు.. టీ..ఆర్‌ఎస్‌ఎస్‌ పార్టీ..’ అని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్‌ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి మోదీని.. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా కేసీఆర్‌ అవినీతి కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 22 లక్షల మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ప్రతి పేదోడి ఇంటికి రూ.5 లక్షలు సాయం అందిస్తామన్నారు. 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని, మహాకూటమిని గెలిపించాలని రాహుల్‌గాంధీ కోరారు. 


తెలంగాణ తల్లి.. సోనియాగాంధీ  
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని మాజీ మం త్రి, కాంగ్రెస్‌ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి డీకే అరుణ కొనియాడారు. ఎన్నికల ముందు రైతులను మోసం చేయడానికి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామన్నారు. 371(జే) గద్వాలకు ప్రత్యేక హోదా కల్పించి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసేందుకు కృషిచేస్తామన్నారు. 


నా హయాంలోనే అభివృద్ధి
మంత్రి, ఎమ్మెల్యేగా తన హయాంలోనే గద్వాల నియోజక వర్గ అభివృద్ధి జరిగిందని డీ.కే.అరుణ వెల్లడించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ప్రజల సమస్యల్లో పాలుపంచుకుంటూ అభివృద్ధి చేశానని వెల్లడించారు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అసమర్థ పాలన కారణంగా ముందస్తు ఎన్నికలు వచ్చాయని విమర్శించారు.

కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా, నాయకులు సలీంఅహ్మద్, నర్సిరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుధాకర్, నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాష్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్‌కుమార్, నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, శివసేనారెడ్డి, కృష్ణవేణి, రామాంజనేయులు, పద్మావతి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

 
కూటమిని గెలిపించండి  
ప్రజా యుద్ధనౌక గద్దర్‌ మాట్లాడుతూ.. ‘మా భూములు, మా నీళ్లు, మా నిధులు మాకు కావాలి..’ అనే నినాదంతో పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే.. పాలకుల నిర్లక్ష్యానికి ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే మహాకూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలపించిన పాటకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. 
 

మరిన్ని వార్తలు