ఇరు రాష్ట్రాలది స్నేహపూర్వక బంధం

31 Jan, 2018 01:43 IST|Sakshi

తెలంగాణ, కర్ణాటక మంత్రులు మహేందర్‌ రెడ్డి, శరణు ప్రకాశ్‌ పాటిల్‌ 

బషీరాబాద్‌(తాండూరు): తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంత రైతాంగం ప్రయోజనాల కోసం ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి శరణు ప్రకాశ్‌ పాటిల్‌ వెల్లడించారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్, కర్ణాటక సరిహద్దులోని హల్కోడ సమీపంలో కాగ్నా నదిపై అక్కడి ప్రభుత్వం రూ.5.10 కోట్లతో నిర్మించిన అంతర్‌రాష్ట్ర అనుసంధాన వంతెనను మంత్రులు ప్రారంభించారు.

కర్ణాటకలోని జెట్టూరు వద్ద రూ.25.65 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి కంబ్యారేజీకి తెలంగాణ అనుమతులు ఇవ్వడంతో ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు టీఎస్‌ ఆర్టీసీ 1,130 బస్సు సర్వీసులు నడుపుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సరహద్దులోని కర్ణాటకను అనుసంధానిస్తూ వంతెనలు, రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. శరణు ప్రకాశ్‌ పాటిల్‌ మాట్లాడుతూ 371జే ఆర్టికల్‌ ప్రకారం హైదరాబాద్‌–కర్ణాటక సరిహద్దు ప్రాంత అభివృద్ధి బోర్డు ద్వారా దక్షిణ కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, యాద్గిర్, రాయ్‌చూర్, కొప్పడ్‌ జిల్లాల్లో నాలుగేళ్లలోనే రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 

మరిన్ని వార్తలు