ఆంధ్ర విద్యార్థులకు ఉపశమనం

26 Mar, 2020 01:41 IST|Sakshi

హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేతతో ఆందోళన 

ఏపీకి రావాలని ప్రయత్నం.. పాస్‌ల కోసం హైదరాబాద్‌లోని స్టేషన్లకు 

పోలీసులిచ్చిన పాస్‌లతో వేలాదిగా సరిహద్దుల వద్దకు రాక

హాస్టళ్లు మూసివేయొద్దని వినతి..

సానుకూలంగా స్పందించిన టీసర్కార్‌

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసేయాలనే నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వెల్లువలా తరలివచ్చి ఇబ్బందులు పడుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్‌లోనే ఉండేలా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పించింది. ఈ అంశంపై తొలుత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో బుధవారం ఫోన్లో మాట్లాడారు. అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరిపారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉన్న వారిని హెల్త్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి రాష్ట్రంలోకి అనుమతించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అనంతరం చెక్‌పోస్టుల వద్ద ఉన్న విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, వారిని రాష్ట్రంలోకి అనుమతించారు. 

ఏపీ, తెలంగాణ సీఎంల సంప్రదింపులు
కరోనా నివారణలో భాగంగా ఎక్కడి వారు అక్కడే ఉండేట్టుగా చూడాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. బుధవారం రాత్రి ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సంప్ర దింపులు జరిపారు. జగ్గయ్యపేట వద్దకు చేరుకున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఇకపై హైదరాబాద్‌ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేదిలేదని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. అలా అనుమతిస్తే వారికే కాక వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా రిస్క్‌లో పెట్టి నట్లు అవుతుందని అధికారులు పేర్కొం టున్నారు. హాస్టళ్లు, మెస్‌లు మూయ వద్దంటూ ఇదివరకే  తెలంగాణ ప్రభు త్వం, మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అయినా హాస్టళ్లు మూసివేస్తుండటంతో వాటి యజమానులతో అధికారులు చర్చలు జరిపి, వాటిని తెరిపిస్తున్నారు.  

హైదరాబాద్‌లో ఇబ్బంది పడిన రాష్ట్ర విద్యార్థులు, తదినంతర పరిణామాలు ఇలా..
హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు హాఠాత్తుగా మూసివేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, యువత రోడ్ల మీదకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికిప్పుడు ఏం చేయాలో దిక్కు తోచడం లేదంటూ పలువురు పోలీస్‌స్టేషన్లకు వచ్చారు.
వారు స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు హైదరాబాద్‌లో పాస్‌లు జారీ చేశారు.
ఆ పాసులతో యువత కార్లు, బైకులపై రాష్ట్రానికి తరలివచ్చారు. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోకి అనుమతించబోమంటూ వారిని రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద వేలాదిగా యువత నిలిచిపోయారు. వీరి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది.
రాష్ట్రం మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో చర్చించారు. కరోనా వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్న సమయంలో విద్యార్థులు, యువత ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరం కాదని కేటీఆర్‌ దష్టికి తీసుకెళ్లారు. వారికి ఇప్పటికిప్పుడు రవాణా సదుపాయాలు కూడా లేవన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కూడా ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తో చర్చించారు. 
ఈ సంప్రదింపులు ఫలించాయి. హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసివేయొద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విçస్పష్ట ప్రకటన చేశారు. 
ఈ మేరకు హాస్టళ్లు, మెస్‌ల యజమానులతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ మేయర్, నగర పోలీసు కమిషనర్‌ను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 
హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడంలేదని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, యువతకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే 1902కు కాల్‌ చేస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామన్నారు.
హాస్టళ్లలో ఉన్న వారినెవరినీ బయటకు పంపించకూడదని, స్వస్థాలకు వెళ్లడానికి ఇప్పటివరకు పోలీసులు జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. 
చెక్‌పోస్టు వద్ద భారీగా జనం
తెలంగాణ ప్రభుత్వం తొలుత జారీ చేసిన అనుమతి పత్రాలు పట్టుకుని భారీ సంఖ్యలో విద్యార్థులు పలు వాహనాల్లో తరలి వచ్చారు.  వీరంతా హైదరాబాద్‌ నుంచి ఒక్కసారిగా ఏపీకి వస్తున్నందున కరోనా వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్త్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి వారిని అనుమతిస్తున్నారు.
 ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద బుధవారం రాత్రి పరిస్ధితిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిశీలించారు. 


తెలంగాణ నుంచి వస్తున్న వారిని ‘జగ్గయ్యపేట’ వద్ద  నిలిపివేయటంతో బారులు తీరిన వాహనాలు

ఈరోజే ఎందుకిలా?
ప్రయివేటు ఉద్యోగాల రీత్యానో, కోచింగ్‌ల కోసమో కొంతకాలంగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే హాస్టళ్లలో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడి హాస్టళ్లను మూసివేస్తుండడంతో వీరంతా ఏపీకి పయనమయ్యారు. బయట ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు ఉండడడంతో బుధవారం వేలాదిగా పోలీసులను ఆశ్రయించారు. చెక్‌పోస్టులు, టోల్‌గేట్లలో ఆపకుండా అక్కడి పోలీసులు వారికి నిరభ్యంతర పత్రాలు జారీ చేశారు. అంతలో ఏపీ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వాన్ని సంప్రదించి హాస్టళ్లు మూసేయకుండా చర్యలు తీసుకుంది. ఇప్పటికే చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అనుమతిస్తోంది.
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఇదొక్కటే మార్గం.. భేష్‌)
(మూడేళ్ల బాలుడికి కరోనా)

మరిన్ని వార్తలు