నీటితొట్టిలో పడి బాలుడి మృతి

14 Aug, 2019 11:54 IST|Sakshi

సాక్షి, శాలిగౌరారం(నల్గొండ) : నీటితొట్టిలో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం గ్రామానికి చెందిన కారింగుల శంకరయ్య–పద్మ దంపతులకు కుమార్తె, కుమారుడు శివ(9)లు ఉన్నారు. కుమార్తె కళాశాల విద్య చదువుతుండగా కుమారుడు శివ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. రోజువారీ మాదిరిగానే పాఠశాలకు వెళ్లివచ్చిన శివ సాయంత్రం రాగానే ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి వద్దకు కాళ్లు కడుక్కునేందుకు వెళ్లాడు.  కొద్దిమేర నీరు ఉండటంతో డబ్బాతో నీటిని అందుకునేందుకు నీటితొట్టి(గోళెం)లోకి వంగాడు.

దీంతో ప్రమాదవశాత్తు జారి అందులో తలకిందులుగా పడిపోవడంతో  నీటిలో శివ తల మునిగి ఊపిరాడక మృతిచెందాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన శివ తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకని నీటితొట్టి వద్దకు వెళ్లేసరికి వారి కుమారుడు నిర్జీవంగా పడిఉన్నాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వెంటనే కుమారుడిని నీటితొట్టిలో నుంచి బయటకు తీసి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. విషయం గ్రామంలో దావనంలా వ్యాపించడంతో శివ మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. 

ఆవిరైన తల్లిదండ్రుల ఆశలు
కారింగుల శంకరయ్య–పద్మ దంపతులు తమకు ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి ఆ బాలుడి ప్రాణాలను హరించడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడి మృతితో శివ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిరీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల రోదనను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటినిగార్చక ఉండలేకపోయారు.

నాచే ప్రాణం తీసిందా..?
కారింగుల శివ మరణానికి నీటితొట్టికి ఉన్న నాచే కారణమా..? అంటే.. అవునపిస్తోంది. శంకరయ్య ఇంటిలో వాడుకునే నీటికోసం ఇంటి ఆవరణలో ఉన్న సిమెంట్‌ నీటితొట్టి లోపలి భాగంలో పూర్తిగా నాచు పేరుకుపోయింది. నీటితొట్టిలో అడుగు భాగంలో కొద్దిమేర నీరు ఉండటంతో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన శివ డబ్బాతో నీటిని అందుకునేందుకు దాని అంచుపై చేయిపెట్టి లోపలికి ఒరిగాడు. ఈక్రమంలో నీటితొట్టిపై ఉన్న నాచువల్ల చేయి జారడంతో అదుపుతప్పి ప్రమదవశాత్తు తలకిందులుగా జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తల నీటిలో మునగడంతో ఊపిరాడక మృతిచెందాడు. నీటితొట్టిలో నాచులేకుంటే ప్రాణం పోయిఉండేది కాదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు