సంపులో పడి బాలుడి దుర్మరణం

5 Dec, 2015 23:54 IST|Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్: ఓ బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బడంగ్‌పేట్‌లో ఉంటున్న టేకుమట్ల సత్యనారాయణ, మంజుల మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మెదక్ జిల్లా అవుసులపల్లి నుంచి వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు. వీరి చిన్న కొడుకు ప్రభుకుమార్ (6) నాదర్‌గుల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు.

ఆందోళనకు గురైన సత్యనారాయణ దంపతులు కుమారుడి కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. కాగా, శనివారం నాదర్‌గుల్ ప్రభుత్వ పాఠశాల వెనకాల నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోని సంపులో ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రభుకుమార్‌గా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విగతజీవిగా పడి ఉన్న ప్రభుకుమార్‌ను చూసిన తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు