కాలిన గాయాలతో ముస్తఫా మృతి

10 Oct, 2014 01:42 IST|Sakshi
కాలిన గాయాలతో ముస్తఫా మృతి

హైదరాబాద్: మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్‌లో ఆడుకోడానికి వెళ్లి దుండగులు నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ముస్తఫా (11) గురువారం ఉదయం డీఆర్‌డీఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో మిలిటరీ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, సిద్ధిఖీనగర్ బస్తీవాసులు మిలిటరీ గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు సిద్దిఖీనగర్‌లో అతని ఇంటికి తీసుకెళ్తున్న సమయం లో స్థానికులు మిలిటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జిచేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా 92 శాతం కాలిన గాయాలతో ముస్తఫా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్  టకియుద్దీన్ మీడియాకు తెలిపారు.
 
 రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
 
 ముస్తఫా కుటుంబ సభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు.మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబం మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్‌లో ఉండటంతో మేయర్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ బాలుడి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు.
 
 సుమోటోగా స్వీకరించిన మైనారిటీ కమిషన్


 ముస్తఫా (11) మృతిపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. గురువారం ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఈ నెల 18 లోగా అందించాలని నగర పోలీసు కమిషనర్, వెస్ట్‌జోన్ డీసీపీ, హుమాయూన్ నగర్ ఇన్స్‌పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల న ష్టపరిహారం, ఇంటివసతి కల్పించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
 

మరిన్ని వార్తలు