అమ్మానాన్న.. నేను బతుకలేకపోతున్నా..

11 Jul, 2019 11:25 IST|Sakshi

తల్లిదండ్రుల గొడవలతో బాలుడి మనస్తాపం

క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణ్‌ 

ధర్మపురి: అభం శుభం తెలియని ఆ బాలుడికి అమ్మానాన్నల గొడవలు మనస్తాపానికి గురిచేశాయి. బడికెల్లి చదువుపై శ్రద్ధ చూపాల్సిన బాలుడిని తల్లిదండ్రుల గొడవలు కలత చెందేలా చేశాయి. నిత్యం తల్లిదండ్రుల గొడవలు మనస్సును బాధపెట్టాయి. అమ్మానాన్నల గొడవలతో మనస్తాపానికి గురై ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పాయల్‌ శ్రీనివాస్‌–మమతలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్‌ భార్యతో కలిసి మంచిర్యాల జిల్లాకేంద్రలో ఫైనాన్స్‌ నడిపిస్తుంటాడు. వీరికి కుమారుడు శ్రావణ్‌(12), కూతురు(5) సంతానం. కుమారుడు పుట్టిన తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. గొడవలు ఏగలేక భార్య మమత నాలుగేళ్ల క్రితం పుట్టింటికొచ్చింది. ఐదేళ్ల క్రితం దంపతులకు మరోపాప(5) జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. భార్యాభర్తల గొడవలపై పలుమార్లు గ్రామంలో పంచాయితీలు నిర్వహించారు. చివరికి పోలీస్‌స్టేషన్‌లోనూ పలుమార్లు పంచాయితీలు జరిగాయి. 
రెండో పెళ్లే కారణమా?
భార్యాభర్తల మధ్య గొడవలకు రెండో పెళ్లే కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి భార్య మమతకు విడాకులివ్వాలని భర్త శ్రీనివాస్‌ గొడవలు పడుతుండేవాడని తెలిసింది. నాలుగేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉండేవారని విడాకుల విషయంలో మమత నిరాకరించడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. 25 రోజుల క్రితం భూపాలపల్లె జిల్లా ములుగు మండలానికి చెందిన ఓ అమ్మాయితో శ్రీనివాస్‌కు రెండో వివాహమైనట్లు తెలిసింది. విషయం పంచాయితీ పెద్దల వరకు చేరింది. శ్రీనివాస్, వారి పాలివాళ్లకు చెందిన పొత్తుల భూమి సుమారు 20 ఎకరాల వరకు ఉన్నట్లు.. పంచాయితీలో మొదటి భార్య మమతకు రెండెకరాలు ఇవ్వాలని పెద్దలు చెప్పిన తీర్పును శ్రీనివాస్‌ నిరాకరించినట్లు తెలిపారు. శ్రీనివాస్‌ రెండో పెళ్లితో మొదటి భార్య విడాకుల వరకు చేరింది. తల్లిదండ్రుల గొడవలు, తండ్రి రెండో పెళ్లి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపాయి. తల్లిదండ్రుల గొడవలకు ఏగలేక కుమారుడు శ్రావణ్‌ బుధవారం ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ధర్మారం మండలంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు.  

మరిన్ని వార్తలు