భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు 

2 Apr, 2018 02:46 IST|Sakshi
గోదావరిలో చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు

గోదావరిలో ఘనంగా చక్రతీర్థం 

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నెల 18 నుంచి జరుగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లారు. అక్కడి పునర్వసు మండపంలో నవకలశ స్నపనం జరిపించారు.

అనంతరం సుదర్శన చక్రానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత గరుడ పటాన్ని ధ్వజస్తంభం నుంచి దింపి ప్రత్యేక పూజలు చేశారు. దేవతలందరికీ ప్రత్యేక పూజల ద్వారా ఉద్వాసన(వీడ్కోలు) పలికారు. దీంతో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు పరిసమాప్తమైనట్లు ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ప్రకటించారు. కాగా, సోమవారం నుంచి యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు