పాతికేళ్లకే బ్రెయిన్‌ స్ట్రోక్‌

8 Oct, 2019 10:21 IST|Sakshi
డాక్టర్‌ సుభాష్‌కౌల్‌

40 ఏళ్లలోపు వయస్కుల్లో 20 శాతం మరణాలకు ఇదే కారణం 

మానసిక ఒత్తిడి, ఆందోళనతోనే ఎక్కువ ముప్పు 

న్యూరాలజీ సదస్సులో డాక్టర్‌ సుభాష్‌కౌల్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మనిషి మొదడు మొద్దుబారుతోంది. ఓపక్క పని ఒత్తడి.. మరోపక్క నిద్రలేమి వెరసి దాని పనితనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే ప్రమాదకరమైన బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణమవుతుంది. ప్రస్తుతం 40 ఏళ్లలోపు వయస్కుల్లో వెలుగు చూస్తున్న 20 శాతం మరణాలకు ఇదే కారణంమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెచ్‌సీసీ వేదికగా ఇటీవల నిర్వహించిన ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ’ వార్షిక సదస్సులో దేశవిదేశాలకు చెందిన సుమారు 2500 మంది న్యూరోసర్జన్లు హాజరై ఇదే అభిప్రాయం వెలుబుచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ సదస్సు కో–చైర్మన్‌ డాక్టర్‌ సుభాష్‌కౌల్‌ యువత మొదడు ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో వివరించారు.  

ఒత్తిడి వల్ల చిన్నతనంలోనే స్ట్రోక్‌ 
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లకు తోడు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో ఒకప్పుడు యాభై ఏళ్ల తర్వాత వెలుగు చూసిన బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ పాతికేళ్ల వయస్కుల్లోనే కనిపించడం ఆందోళన కలిగించే అంశం. టార్గెట్లను ఛేదించాలనే ఆశయంతో రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పనిచేస్తూ, మానసికంగా తీవ్ర ఒత్తిడిలోనవుతున్నారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన బాధితులను ఆరు గంటల్లోగా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందించగలిగితే ప్రాణాలు కాపాడొచ్చు. అవగాహన లేమికితోడు నిర్లక్ష్యం వల్ల చాలామంది పూర్తిగా కాళ్లు, చేతులు, మాట పడిపోయిన తర్వాత అచేతనాస్థితిలో ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. అప్పటికే మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి మృత్యువాతపడుతున్నార’ని డాక్టర్‌ కౌల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

మానసిక ప్రశాంతతతోనే విముక్తి 
ఇప్పటికే హై బీపీతో బాధపడుతున్న వారు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రశాంత మైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. అంతేకాదు వేళకు ఆహారం తీసుకోవడం, ఆహారంలో పిండిపదార్థాలకు బదులు పీచుపదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవడం, మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండటం, ప్రతిరోజు ఉదయం కనీసం అరగంట పాటు వ్యాయామం, యోగాతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. మానసిక ఆరోగ్యం, చికిత్సల్లో వచ్చిన అత్యాధునిక మార్పులను అధ్యయనం చేసేందుకు ఇలాంటి సదస్సులు భావితరం వైద్యులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు