బ్రాండ్‌ విదేశీ.. మందు దేశీ..!

8 Oct, 2017 03:36 IST|Sakshi

హైదరాబాద్‌లో నకిలీ విదేశీ మద్యం దందా

స్టార్‌ హోటళ్ల నుంచి విదేశీ బ్రాండ్ల ఖాళీ సీసాల సేకరణ

వాటిలో లోకల్‌ బ్రాండ్ల మద్యం నింపి అమ్మకం

ముంబైకి చెందిన ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్ల కనుసన్నల్లో వ్యాపారం

నిందితుల్ని అదుపులోకి తీసుకున్న రాష్ట్ర ఎక్సైజ్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఖరీదైన విదేశీ మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలను సేకరించడం.. దానిలో లోకల్‌ విస్కీ, వోడ్కా నింపేసి విదేశీ మద్యం పేరిట అమ్మేయడం.. అంతర్జాతీయ మార్కెట్లో రూ.42 వేల ధర పలికే బ్రాండ్‌ సీసాలో రూ.వెయ్యి విలువైన లోకల్‌ మద్యం.. రూ.3,600 విలువైన బ్రాండ్‌ ఖాళీ సీసాల్లో రూ.300కు దొరికే వోడ్కా నింపడం.. వాటిని విలాసవంతమైన ప్రాంతాల్లో అమ్మేయడం.. హైదరాబాద్‌లో ముంబై నకిలీ మద్యం ముఠా సాగిస్తున్న అక్రమ వ్యాపారమిదీ. గత రెండేళ్లుగా ఈ గ్యాంగ్‌ దందా కొనసాగిస్తున్నా ఎౖMð్సజ్‌ పోలీసులు పసిగట్టలేక పోయారు. ముంబై ఎక్సైజ్‌ పోలీసులు అందిం చిన సమాచారంతో చివరికి నిందితుల్ని పట్టుకు న్నారు. వారి నుంచి విదేశీ బ్రాండ్లకు చెందిన 142 నకిలీ మద్యం సీసాలను, మరో 183 ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

దందా సాగుతోందిలా..
ముంబై నగరానికి చెందిన అంతర్జాతీయ మద్యం స్మగ్లర్లు ఘాంజీభాయి, ముఖేశ్‌ కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. వీరికి చెందిన ఓ ముఠా 10 రోజుల క్రితం ముంబైలో అక్కడి ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబ డింది. వారిని విచారించగా.. హైదరాబాద్‌లోనూ ఒక ముఠా నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. స్టేషనరీ వ్యాపారం ముసుగులో ముంబై నుంచి వివిధ రకాల విదేశీ బ్రాండ్లకు చెందిన లేబుల్స్, మూతలు, సీల్స్, కార్టర్లు తెప్పించే వారు. స్టార్‌ హోటళ్లలో తాగి పడేసిన విదేశీ మద్యం ఖాళీ సీసాలను సేకరించి, స్థానిక మద్యం దుకాణాల్లో చౌక ధరకు దొరికే బ్రాండ్ల మద్యాన్ని ఆ బాటిల్స్‌లో పోసి మూతపెట్టి, లేబుల్‌ అతి కించి విక్రయించేస్తున్నారు. లేబుల్‌ చెదరకుం డా.. సులభంగా మద్యం సీసాల మీద మూతలు ఊడ దీయటం, తిరిగి పెట్టడంలో తర్ఫీదు ఉన్న వ్యక్తులే ఈ వ్యాపారానికి కీలకం. ఇందుకోసం స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ గుజరాత్‌కు చెందిన మహేశ్‌ అంబావి అనే నిçపుణుడిని పంపింది. అతన్ని కూడా టాస్క్‌ఫోర్స్‌ అరెస్టు చేసింది.

నిఘా లోపంతోనే వ్యాపారం..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,మాదాపూర్‌ లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్‌ పర్మిట్‌ ఫంక్షన్లలోనే ఈ నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ ప్రాథమిక విచారణలో తేలింది. ఫోన్‌ కాల్‌ ద్వారా ఆర్డర్‌ తీసుకుని ఎమ్మార్పీ ధర మీద 20 నుంచి 30 శాతం తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫంక్షన్‌ హాళ్లలో మద్యం పార్టీ కోసం ఈవెంటు పర్మిట్‌ ఇస్తున్న అధికా రులు.. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం మద్యం డిపోల నుంచే కచ్చితంగా మద్యం తెచ్చుకునేలా కట్టుదిట్టం చేయాలి. కానీ మద్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారనే అంశాన్ని అధికారులు విస్మరిస్తు న్నారు. దీంతో ఇలాంటి నకిలీ మద్యానికి అవకాశం చిక్కుతోంది.

టోల్‌ఫ్రీకి కాల్‌ చేయండి
తక్కువ ధరకే విదేశీ మద్యం విక్రయిస్తున్నారని తెలిసినా.. ఫోన్‌ కాల్‌ ద్వారా ఎవరైనా ఆర్డర్‌ అడిగినా 18004252523 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ కోరారు. టీఎస్‌బీసీఎల్‌ ద్వారా రాష్ట్రంలో దాదాపు 4,500 రకాల బ్రాండ్ల విదేశీ మద్యం అమ్ముతున్నామని, ప్రజలు కార్పొరేషన్‌ మద్యాన్నే తాగాలని ఆయన సూచించారు. మద్యం సీసాలపై త్రీడీ హోలోగ్రామ్‌ సీల్‌ ఉంటుందని, దీనికి నకిలీ తయారు చేయడం సాధ్యం కాదని, అందువల్ల హోలోగ్రామ్‌ సీల్‌ ఉన్న మద్యంనే కొనుగోలు చేయాలని చెప్పారు.  

>
మరిన్ని వార్తలు