‘ఆరోగ్యశ్రీ’కి బ్రేక్‌!

20 Nov, 2018 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి బ్రేక్‌ పడింది. ఈ పథకం కింద వైద్య సేవలు పొందే పేదలతోపాటు ప్రభుత్వోద్యోగులు–జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌) కింద వైద్య సేవలు అందుకునే వారికి మంగళవారం నుంచి ఉచిత, నగదురహిత వైద్యం నిలిచిపోనుంది. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాల కింద అందించే ఔట్‌ పేషెంట్‌ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిలిపివేయాలని తెలంగాణ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది.

ఈ మేరకు సోమవారం ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వి. రాకేశ్, కార్యదర్శి టి. హరిప్రకాశ్‌ ప్రకటన విడుదల చేశారు. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ. 1,200 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుంటే సేవలను నిలిపేస్తామని వారం క్రితమే హెచ్చరించినా అధికారులు స్పందించలేదని వారు విమర్శించారు. అందుకే మంగళవారం నుంచి కొన్ని రకాల సేవలను నిలిపివేస్తామని, డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. వైద్య సేవల నిలిపివేతపై ఆస్పత్రుల సంఘం అధికారికంగా ఇప్పుడు ప్రకటన చేసినప్పటికీ కొన్ని నెలల నుంచే కార్పొరేట్, ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ కింద వైద్య సేవలను నిలిపేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ రోగులతోపాటు ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులు సొంతంగా డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

అధికార యంత్రాంగంలో చలనం ఏదీ? 
ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవలను నిలిపేస్తామని ఆస్పత్రులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో మాత్రం చలనం కనిపించట్లేదు. ఈ విషయంపై ఆరోగ్యశ్రీ అధికారులకు ఆస్పత్రుల సంఘం నోటీసు పంపినప్పటికీ ఆస్పత్రుల యాజమాన్యాలను సముదాయించడంలో, వారి బకాయిలను తీర్చడంలో అధికారులు విఫలమయ్యారు. పైగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు టూర్ల పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. అస్సాంలో జాతీయ సదస్సు ఉందంటూ నాలుగు రోజులు, తమిళనాడులో సర్కారు వైద్యంపై అధ్యయనం పేరిట మూడు రోజులపాటు పర్యటించి ఆదివారం తిరిగి వచ్చారు. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాల కింద పేదలు, ఉద్యోగులకు వైద్యం అందని పరిస్థితుల్లో ఇలాంటి అప్రాధాన్య టూర్లు పెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు డబ్బు ఇవ్వకుంటే తామేం చేయగలమంటూ కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రులు, అధికారుల పేచీ మధ్యన రోగులు నలిగిపోతున్నారు. 

మరిన్ని వార్తలు