ఆరోగ్యశ్రీకి అస్వస్థత! 

14 Nov, 2018 03:10 IST|Sakshi

     అధికారులు పట్టించుకోకపోవడంతో నగదు రహిత వైద్య సేవలకు బ్రేక్‌

     నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సేవల బంద్‌కు పిలుపునిచ్చినా చర్యలు శూన్యం

     వైద్యాధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

     వైద్య సేవలు అందక పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల ఇక్కట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు–జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌) పథకం కింద వైద్యం చేయించుకునే వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్, ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నగదు రహిత వైద్య సేవలకు బ్రేక్‌ వేశాయి. దీంతో అనారోగ్యం పాలైన ఈ పథకాల లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇటు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ సేవలను పూర్తిగా నిలిపివేస్తామని ఆస్పత్రులు హెచ్చరిస్తున్నా ఇటు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చలనం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో కీలకంగా ఉండాల్సిన ఆ శాఖ అధికారులు నగదు రహిత వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి చెప్పుకుందామంటే ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధికారులు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సొంతంగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పేదలైతే దేవుడిపైనే భారం వేశారు. 

అందుబాటులో లేని వైద్యాధికారులు... 
రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్న ఆరోపణలున్నాయి. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థంగాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నిమగ్నమవ్వడంతో తమని అడిగేవారు ఎవరూ లేరన్న ధీమా, నిర్లక్ష్యం కొందరు అధికారుల్లో కనిపిస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీకి, ఈజేహెచ్‌ఎస్‌కు ప్రభుత్వం రూ.1,200 కోట్ల బకాయి పడిందని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోతే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి ఓపీ డయాగ్నోస్టిక్, డిసెంబర్‌ 1 నుంచి ఇన్‌పేషెంట్‌ సేవల్ని కూడా నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే ఆ సేవలు కొన్ని ఆస్పత్రుల్లో నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాల లబ్ధిదారులకు డబ్బులకు వైద్యం చేయమన్నా ముందుకు రావడం లేదు. నగదు రహిత వైద్యం చేయలేదంటూ ఎక్కడ బాధితులు ఫిర్యాదు చేస్తారన్న భయంతో ఆస్పత్రి వర్గాలు పడకలు లేవంటూ వెనక్కు పంపిస్తున్నాయి. 

చర్చలు జరిపే వారేరి.. 
వైద్య సేవల నిలిపివేతపై ఆస్పత్రులు హెచ్చరికలు జారీచేసినా, కొన్ని వైద్య సేవలను నిలిపేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం ఆయా ఆస్పత్రుల వారిని పిలిపించి చర్చించే వారు లేకుండా పోయారన్న ఆరోపణలున్నాయి. బకాయిల్లో ఇప్పుడు ఎంత తీర్చుతారో కూడా చెప్పడం లేదని ఆస్పత్రుల వర్గాలు అంటున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం రూ.1,200 కోట్ల బకాయిలు ఏమీలేవనీ, ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఆస్పత్రులు, ఇటు అధికారుల తీరుతో మధ్యన ప్రజలు, ఉద్యోగులు, జర్నలిస్టులు నలిగిపోతున్నారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సైతం ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు