గొర్రెల పంపిణీకి బ్రేక్‌!

7 Nov, 2017 01:11 IST|Sakshi

     సహాయ నిరాకరణకు దిగిన వెటర్నరీ అధికారులు 

     చిన్న తప్పిదాలకే బాధ్యులను చేయడంపై గరం.. గరం 

     సిరిసిల్ల జిల్లా ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా జీవాల పంపిణీ బంద్‌ 

     వారం రోజులుగా నిలిచిపోయిన గొర్రెల అందజేత 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గొర్రెల పంచాయితీ రచ్చకెక్కింది. అధికారుల సహాయ నిరాకరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గొర్రెల పంపిణీకి అర్ధంతరంగా బ్రేక్‌ పడింది. ఇప్పటికే అధిక ధరలు, రీ సైక్లింగ్, సంతలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో తలబొప్పి కట్టిన సర్కారుకు తాజాగా పశుసంవర్థకశాఖ యంత్రాంగం షాక్‌ ఇచ్చింది. జీవాల కొనుగోళ్లు మొదలు రాష్ట్రానికి తరలించే వరకు బాధ్యత వహించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. సిరిసిల్ల జిల్లాలో జరిగిన అవకతవకలపై ఇద్దరు అధికారులపై వేటు వేసింది. ఈ నిర్ణయమే వెటర్నరీ ఉద్యోగుల సహాయ నిరాకరణకు దారితీసింది. దీంతో వారంరోజులుగా గొర్రెల పంపిణీ పథకం నిలిచిపోయింది. గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా వర్గాలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తోంది. జూలైలో ప్రారంభమైంది. జీవాల కొనుగోలు, జిల్లాకు తరలించడం  అధికారులకు తలనొప్పిగా మారింది.  పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో వీటికి డిమాండ్‌ పెరిగింది.  డిమాండ్‌కు తగ్గ జీవాల లభ్యత లేకపోవడం.. ఆ జీవాలను తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది. 

సగటున రోజుకు 2025 యూనిట్లు 
లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా గొర్రెల లభ్యత లేకపోవడంతో.. ప్రతి రోజు సగటున 20 నుంచి 25 యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. జీవాల పంపిణీలో చోటుచేసుకుంటున్న చిన్న తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తున్నా రని ఆగ్రహించిన పశుసంవర్థకశాఖ అధికారులు గొర్రెల సేకరణకు దూరంగా ఉన్నారు. 

ఎదురుచూపుల్లో 400 మంది! 
గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న సదాశయంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీకి  జూలైలో శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్‌ ధర రూ.1.25 లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. యూనిట్‌ విలువలో 75 శాతం అనగా రూ.93,750 సబ్సిడీ అందజేస్తోంది. మిగిలిన 25 శాతం (రూ.31,250) లబ్ధిదారులు భరించాలి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది దాదాపు 20 వేలమంది లబ్ధిదారులకు డిసెంబర్‌లోగా అందజేయాలి. కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 3,407 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు.  గొర్రెల కొనుగోలుకు కర్ణాటక వెళ్లేందుకు పశువైద్యాధికారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా వారం రోజులుగా ఒక్క యూనిట్‌ కూడా లబ్ధిదారునికి చేరలేదు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతే గొర్రెలను తెచ్చేందుకు ముందుకు సాగుతామని అధికారులు అంటున్నారు.

గొర్రెల పంపిణీని సమర్థంగా నిర్వహించండి 
అధికారులకు మంత్రి తలసాని ఆదేశం.. 
సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆయన తన చాంబర్‌లో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై పశుసంవర్థకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్, పశువైద్యాధికారుల అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. గొర్రెల కొనుగోళ్లలో జరుగుతున్న పొరపాట్లను నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు అధికారులను పంపించి సమాచారం సేకరించాలని మంత్రి డైరెక్టర్‌ను ఆదేశించారు. అలాగే గొర్రెల లభ్యత తగ్గడానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరముందన్నారు. ఇటీవల ప్రారంభించిన మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల పనితీరును గురించి కూడా ఈ సమావేశంలో తలసాని సమీక్షించారు.   

మరిన్ని వార్తలు